ఇటీవల కాలంలో జనసేనకు అధికారం ఇవ్వాలని, తానే సీఎం అవుతానని పవన్‌కల్యాణ్ చెప్పడం, ఆయనలో వచ్చిన మార్పుగా అందరూ భావించారు. అయితే తానే సీఎం అవుతానని చెప్పడంపై పవన్ తాజాగా కొత్త భాష్యం చెప్పడం విశేషం. సీఎం అవుతానని చెప్పింది కేవలం తన వాళ్ల కోసమే అని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. చంద్రబాబు, టీడీపీ శ్రేణుల్ని చల్లబరిచేందుకు పవన్ సీఎం కోరుకోవడంపై వివరణ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ నిలకడలేని రాజకీయ నాయకుడనే విమర్శను బలపరిచేలా కామెంట్స్ ఉన్నాయి. ఎల్లో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వెల్లడించిన అభిప్రాయాలు రాజకీయంగా ఆయన్ను అభాసుపాలు చేసేలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేనే సీఎం అంటున్నారు…దీనిపై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్నకు, జనసేన శ్రేణులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం.
‘సీఎం’ అని మా వాళ్ల కోసం అన్నాను. సీఎం సీఎం అని మావాళ్లు అరుస్తుంటే, నా కేడర్ నినాదాన్ని ఆమోదించాను. సీఎం అని మావాళ్లు అనుకుంటే సరిపోదు కదా. ప్రజలు కూడా అనుకోవాలి’ అని ఆయన చెప్పి తన కార్యకర్తలు, నాయకుల్ని చావుదెబ్బ తీశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎల్లో మీడియాకు చెందిన రెండు పత్రికలు ఒకే రోజూ పవన్‌కల్యాణ్‌తో ఇంటర్వ్యూ తీసుకోవడం, దాన్ని ప్రచురించడం చూస్తే… అంతా చంద్రబాబు కనుసన్నళ్లో జరిగిందని అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ సొంత ఎజెండాతో ముందుకెళుతున్నారనే భావన క్రమంగా పెరుగుతోంది. దీంతో టీడీపీకి రాజకీయంగా నష్టం వాటిల్లుతోందని చంద్రబాబు గ్రహించారు.
పవన్‌ను రాజకీయంగా నష్టపరిచైనా, ఆయనతో సీఎం పదవిపై బహిరంగ సమావేశాల్లో చెబుతున్న దానికి భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పించారు. పవన్ మనసులో మాట ఏంటో ఎల్లో మీడియా బయట పెట్టింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది జనసేన శ్రేణులే. తాను సీఎం అవుతానని చెప్పిందే, కేవలం పార్టీ కేడర్ కోసమే తప్ప, ప్రజలను దృష్టిలో పెట్టుకుని కాదని పవన్ తేల్చి చెప్పారు. అలాంటి నాయకుడిని నమ్మి వెంట నడవడం అంటే చంద్రబాబు పల్లకీ మోయడానికే అని తేలిపోయింది.