తండ్రిలా నోరుజార‌ని త‌న‌యుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్‌ది ప్ర‌త్యేక స్థానం. ఎప్పుడెలా మాట్లాడుతారో చివ‌రికి వారికే తెలియ‌ని ప‌రిస్థితి. వాళ్ల నోటి దురుసుకు త‌న‌, ప‌రాయి అనే తేడాలుండ‌వు. టీడీపీలోనే వుంటూ చంద్ర‌బాబుపై సెటైర్స్ వేయ‌డం జేసీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్‌ది ప్ర‌త్యేక స్థానం. ఎప్పుడెలా మాట్లాడుతారో చివ‌రికి వారికే తెలియ‌ని ప‌రిస్థితి. వాళ్ల నోటి దురుసుకు త‌న‌, ప‌రాయి అనే తేడాలుండ‌వు. టీడీపీలోనే వుంటూ చంద్ర‌బాబుపై సెటైర్స్ వేయ‌డం జేసీ బ్ర‌ద‌ర్స్‌కే సాధ్యం. 

ఇక ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌పై జేసీ బ్ర‌ద‌ర్స్ అవాకులు చెవాకుల గురించి చెప్పుకోవాలంటే చంద్ర‌బాబు పాల‌న‌లోకి వెళ్లాల్సిందే. అయితే త‌మ పెద్ద‌ల తీరుకు విరుద్ధంగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు అస్మిత్ రెడ్డి మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

2019లో తాడిప‌త్రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. రాజ‌కీయ అరంగేట్రం ఓట‌మితో మొద‌లు కావ‌డం విశేషం. తాజాగా అస్మిత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఇటీవ‌ల పుట్ట‌ప‌ర్తి టీడీపీ ఇన్‌చార్జ్ ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిపై జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌ల్లె కూడా దీటుగా స్పందించారు. ఈ నేప‌థ్యంలో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిపై జేసీ అస్మిత్ రెడ్డి కామెంట్స్ ఆయ‌న మ‌న‌స్త‌త్వాన్ని ప్ర‌తిబింబిస్తున్నాయి.

‘మా నాన్న ప్రత్యేకంగా పుట్టపర్తి పై దృష్టి సారించారనడం తప్పు. మా లక్ష్యం మరోసారి చంద్రబాబును సీఎం చేయడమే. లక్ష్యసాధనలో ఎవరికి టికెట్‌ వచ్చినా రాకున్నా బాధపడేది లేదు. మా నియోజక వర్గంలో మాకంటే కష్టపడే వారు ముందుకొస్తే స్వచ్ఛందంగా టికెట్ వదులుకుంటాం. పల్లె రఘునాథరెడ్డి గురించి మాట్లాడే అంత వయస్సు నాకు లేదు ’  అని అస్మిత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

తండ్రిలా సొంత పార్టీ వాళ్ల‌పై నోరు పారేసుకోకుండా అస్మిత్‌రెడ్డి విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే ఆయ‌న స్వ‌భావ‌మా?  కాదా? అనేది రానున్న రోజుల్లో మ‌రింత స్ప‌ష్టంగా తెలియ‌నుంది.