జిల్లాల ఏర్పాటులో భాగంగా తిరుపతి వాసుల విన్నపాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మన్నించారని సమాచారం. తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే బాలాజీ అని స్థానికంగా ఎవరూ పిలవరని, ఉత్తర భారతదేశం సంస్కృతిని ప్రతిబింబించే పేరు మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. తిరుపతి పేరుతోనే జిల్లాను ప్రకటించాలని పెద్ద ఎత్తున వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో పలు విన్నపాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. వీటిపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించింది. తిరుపతి పేరుతోనే జిల్లాను ప్రకటించడం న్యాయమని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. దీంతో తిరుపతి జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఏప్రిల్ 4న పద్మావతి నిలయం కేంద్రంగా కొత్త జిల్లా నుంచి పాలన సాగించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇవాళ జగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 2న కొత్త జిల్లాలు అవతరిస్తాయని ప్రచారం జరిగినప్పటికీ, రెండు రోజుల ఆలస్యంగా ఆ పని జరగనుంది. ఈ మేరకు జగన్ కేబినెట్ ఆమోద ముద్ర వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తాన్ని ఖరారు చేశారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇకపై 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అవతరణకు వర్చువల్‌గా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు అమల్లోకి రానున్నాయి.