ఆర్ఆర్ఆర్…ఉగాది ఆదుకోవాలి

అపజ‌యం ఎరుగని దర్శకుడు రాజ‌మౌళి. అందులో సందేహం లేదు. కానీ ఆయన అన్ని సినిమాలు ఆర్థికంగా బ్లాక్ బస్టర్లు కావు. ఒకటి రెండు మినహాయింపు. సినిమా ఎంత వసూలు చేసింది అన్నది, ఎన్ని కోట్లు…

అపజ‌యం ఎరుగని దర్శకుడు రాజ‌మౌళి. అందులో సందేహం లేదు. కానీ ఆయన అన్ని సినిమాలు ఆర్థికంగా బ్లాక్ బస్టర్లు కావు. ఒకటి రెండు మినహాయింపు. సినిమా ఎంత వసూలు చేసింది అన్నది, ఎన్ని కోట్లు కొల్లగొట్టింది అన్నది పాయింట్ కాదు. బయ్యర్లు సేఫ్ అయ్యారా లేదా? అన్నదే కీలకం. బయ్యర్లు నష్టపోయిన తరువాత సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయితేనేంటీ? ఎన్ని కోట్లు వసూలు చేస్తే ఏంటి?

ఆర్ఆర్ఆర్ బయ్యర్లు ఇఫ్పటికి ఇంకా సేఫ్ జోన్ కు చాలా దూరంలో వున్నారు. మంగళవారం నుంచి కలెక్షన్లు తగ్గిపోయాయి. అర్బన్ ఏరియాల్లో సినిమా కలెక్షన్లు బాగున్నాయి కానీ రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లో నాలుగు అంకెలకు జారిపోయాయి. విశాఖలో భాగం అయిన గోపాలపట్నం లాంటి చోట్ల నాలుగు అంకెల కలెక్షన్లు కనిపిస్తున్నాయి.

ఓ రేంజ్ పట్టణాల్లో కూడా ఇప్పుడు టికెట్ రేటు 200 నుంచి 265 రూపాయలు వుంది. దీంతో ఫ్యామిలీలు జంకేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ను భుజానకు ఎత్తుకున్నవారు చెబుతున్న లెక్కలు కూడా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో వున్నాయి. విశాఖ ఇప్పటికి 20 కోట్ల మేరకు వసూళ్లు వచ్చాయని చెబుతున్నారు. కానీ ఇంకా ఆరు కోట్ల వరకు రావాల్సి వుంది. ఈస్ట్ గోదావరి 10 కోట్ల వరకు వచ్చిందని చాటింపు వేస్తున్నారు. కానీ అక్కడ ఇంకా ఏడు కోట్ల వరకు రావాలి.

పశ్చిమగోదావరి తొమ్మిది కోట్ల వరకు వచ్చిందంటున్నారు. కానీ ఇంకా అయిదుకోట్లు రావాలి. కృష్ణ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. గుంటూరు 13 కోట్లు వచ్చిందని లెక్కలు చెబుతున్నారు. కానీ ఇంకా అయిదుకోట్లు రావాలి. నెల్లూరు ఆరు కోట్ల లోపలే వుంది. ఇంకా మూడు కోట్లు రావాలి. సీడెడ్ అయితే ఇంకా 16 కోట్ల వరకు రికవరీ రావాల్సి వుంది.

నైజాం లెక్కలు ఓ బ్రహ్మ పదార్థం. అసలు ఫిగర్లు దిల్ రాజుకు, శిరీష్ కు తప్ప మూడో మనిషికి తెలియవు. హీరోల కోసం విపరీతంగా కలపడం అన్నది ఆ సంస్థకు అలవాటైపోయిందని ఇండస్ట్రీలో ఓపెన్ గానే చెప్పుకుంటారు. భీమ్లా నాయక్ కు వీర కలెక్షన్లు చూపించారు. కానీ తనకు మూడు కోట్లు లాస్ అని దిల్ రాజు తన సన్నిహితులతో చెబుతుంటారని వినిపిస్తూ వుంటుంది.

ఇదిలా వుంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ లో కూడా ఇంకా వెనుకబడే వుంది. కర్ణాటకలో సగం మేరకు లక్ష్యం చేరగా, తమిళనాడులో సగానికి కూడా రాలేదు. కేరళ కూడా దాదాపు అంతే.

మొత్తం మీద ఏం వచ్చినా ఈ వీకెండ్ అన్నది కీలకం. ఎందుకంటే ఉగాది, ఆదివారం అన్నీ కలిసి వచ్చాయి. ఈ టైమ్ లో గట్టిగా లాగాల్సి వుంది. ఆదివారం దాటితే మళ్లీ కలెక్షన్లు పడుకుంటాయి. మళ్లీ వారం వేళకు పెద్ద సినిమాలు వచ్చేస్తాయి.