టీడీపీ చివ‌రి అస్త్రం భువ‌నేశ్వ‌రా?

రానున్న ఎన్నిక‌లు టీడీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వి. ఈ ద‌ఫా అధికారంలోకి రాకపోతే టీడీపీ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మే. మ‌రీ ముఖ్యంగా టీడీపీ వార‌సుడు లోకేశ్‌కు రాజకీయ భ‌విష్య‌త్ వుండ‌ద‌నే భ‌యం ఆ పార్టీని వెంటాడుతోంది. ఈ…

రానున్న ఎన్నిక‌లు టీడీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వి. ఈ ద‌ఫా అధికారంలోకి రాకపోతే టీడీపీ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మే. మ‌రీ ముఖ్యంగా టీడీపీ వార‌సుడు లోకేశ్‌కు రాజకీయ భ‌విష్య‌త్ వుండ‌ద‌నే భ‌యం ఆ పార్టీని వెంటాడుతోంది. ఈ నేప‌థ్యంలో స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు అరెస్ట్ కావ‌డం టీడీపీకి కోలుకోలేని దెబ్బ‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ, వైసీపీని ఎందుకు ఓడించాలి? అలాగే త‌మ పార్టీని గెలిపించాల్సిన అవ‌స‌రం ఏంటో జ‌నానికి చంద్ర‌బాబు చెబుతూ ప్ర‌చారం చేసేవారు.

అనూహ్యంగా ఆయ‌న అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో 40 రోజులుగా ఒంట‌రిగా గ‌డుపుతున్నారు. దీంతో అభ్య‌ర్థుల ఎంపిక‌, ద‌స‌రాకు మ్యానిఫెస్టో విడుద‌ల‌, పార్టీలో చేరిక‌లు…ఇలా అన్నీ ఆగిపోయాయి. నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా అర్ధంత‌రంగా నిలిచిపోయింది. చంద్ర‌బాబు కేసుల‌పై వివిధ కోర్టుల్లో విచార‌ణ‌లు సాగుతున్నాయి. బాబు ఎప్పుడు బ‌య‌టికి వ‌స్తారో అంతుచిక్క‌డం లేదు.

దీంతో టీడీపీకి చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి రూపంలో ఆశా కిర‌ణం క‌నిపించింది. ఇక టీడీపీకి ఆమె ఒక్క‌రే దిక్కు అయ్యారు. భువ‌నేశ్వ‌రిని వైసీపీపై అస్త్రంగా ప్ర‌యోగించ‌డానికి టీడీపీ వ్యూహాత్మ‌కంగా క‌దులుతోంది. ‘నిజం గెలవాలి’  పేరుతో భువనేశ్వరిని జ‌నంలోకి తీసుకెళ్లేందుకు టీడీపీ స‌న్నాహాలు చేస్తోంది. మ‌రోవైపు ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో లోకేశ్‌ యాత్ర చేప‌ట్ట‌నున్నారు. లోకేశ్ కంటే భువ‌నేశ్వ‌రిపైనే టీడీపీ ఎక్కువ ఆశ‌లు పెట్టుకున్నారు.

73 ఏళ్ల వ‌య‌సులో అన్యాయంగా త‌న భ‌ర్త‌ను అరెస్ట్ చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో బందించార‌ని క‌న్నీళ్లు పెట్టిస్తే, ముఖ్యంగా మ‌హిళ‌లు క‌రిగిపోయి ఓట్లు వేస్తార‌ని టీడీపీ ఆశిస్తోంది. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌ను అరెస్ట్ చేసిన‌ప్పుడు, ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి ష‌ర్మిల ఇదే ర‌కంగా జ‌నంలోకి వెళ్లి భావోద్వేగాన్ని పండించ‌డం ద్వారా వైసీపీ రాజ‌కీయంగా ల‌బ్ధి పొందిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. అదే ర‌క‌మైన వ్యూహాన్ని తాము కూడా ర‌చించి, వైసీపీని రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌తో వుంది.

చంద్ర‌బాబు అరెస్ట్ అయిన మొద‌లు భువ‌నేశ్వ‌రి ట్వీట్లు, మీడియా ముందు ఆమె మాట్లాడే తీరు చూస్తే… సానుభూతి క‌థ దేవుడెరుగు, ఎన్టీఆర్ పిల్ల‌ల‌పై జ‌నంలో ఉండే అంతోఇంతో ప్రేమ కూడా పోతోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ స‌భ్యులై వుండి, క‌నీసం త‌ప్పుల్లేకుండా, వేగంగా రెండు తెలుగు మాట‌లు కూడా మాట్లాడ‌లేని ద‌య‌నీయ స్థితా ఎన్టీఆర్ పిల్ల‌ల‌ద‌నే అసంతృప్తి ప్ర‌జ‌ల్లో నెల‌కుంది.

ఇత‌ర రాష్ట్రాలకు చెందిన వారెవ‌రైనా తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నార‌నే అభిప్రాయం భువ‌నేశ్వ‌రి మాట‌లు వింటే క‌లుగుతోంది. అలాగే లోకేశ్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి తీరు కూడా అంతే. కానీ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల చ‌క్క‌గా తెలుగులో మాట్లాడ్తారు. తాము చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాన్ని సుత్తి లేకుండా, సూటిగా, ధాటిగా బాణాల్లా సంధిస్తారు. ఇదే ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించింది. 

భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి విష‌యాల‌కు వ‌చ్చే స‌రికి…. వారిపై ఫ‌స్ట్ ఇంప్రెష‌నే బ్యాడ్‌గా ప‌డింది. దీంతో నిజం గెల‌వాల‌నే నినాదంతో భువ‌నేశ్వ‌రి జ‌నంలోకి వెళుతున్న‌ప్ప‌టికీ, ఆమె ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని ఏ మేర‌కు గెలుస్తుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మైంది. మ‌రోవైపు భువ‌నేశ్వ‌రి త‌ప్ప వైసీపీపై ప్ర‌యోగించ‌డానికి టీడీపీ వ‌ద్ద మ‌రో అస్త్రం లేదు. టీడీపీ ప్ర‌యోగించ‌బోచే అస్త్రం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.