ముదిరాజ్ లు లేరా? ఉన్నా సమర్థులు లేరా?

భారతరాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. హ్యాట్రిక్ కొట్టడానికి కీలకమైన ఈ ఎన్నికలను ఎదుర్కోవడంలో అన్ని విధాలుగానూ కులాల సమతూకం కూడా పాటించడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఏ ఒక్క కులానికైనా ప్రాధాన్యం లేదనే ప్రచారం…

భారతరాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. హ్యాట్రిక్ కొట్టడానికి కీలకమైన ఈ ఎన్నికలను ఎదుర్కోవడంలో అన్ని విధాలుగానూ కులాల సమతూకం కూడా పాటించడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఏ ఒక్క కులానికైనా ప్రాధాన్యం లేదనే ప్రచారం వలన.. ఆ కులం ఓట్లు కొన్నయినా తమ పార్టీకి దూరం కావచ్చుననే భయం ఆయన తన నిర్ణయాలను పునస్సమీక్షించుకునేలా చేస్తోంది. 

ఓటు బ్యాంకుల నిర్మాణంలో కులాలు కీలకభూమిక పోసించే తరుణంలో.. తెలంగాణ సమాజంలో ఏ ముఖ్యమైన కులాన్ని కూడా విస్మరించకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం భారాస దాదాపుగా అన్ని స్థానాలకు టికెట్లు ప్రకటించేసినట్టే. అయితే ఇందులో ముఖ్యమైన ముదిరాజ్ వర్గానికి చోటు దక్కలేదు. ఈ లోటును భర్తీ చేయడానికి కేసీఆర్ పెద్ద వ్యూహరచనే చేశారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కు కేసీఆర్ రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికారు. ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. పెద్దపీట వేసి కీలకమైన పదవి అప్పగించడం ద్వారా.. ముదిరాజ్ లకు సముచిత గౌరవం ఇస్తున్నట్టుగా కీర్తి గడించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఈ నిర్ణయం పట్ల పలు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాటం నడిపిన, పదేళ్లుగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిలో.. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒక్కరంటే ఒక్కరైనా తగుమాత్రం నాయకులు లేకుండా పోయారా? అనేదే ఆ చర్చ! ఎమ్మెల్యే లేదా తత్సమాన స్థాయి గౌరవం కల్పించి ఆ వర్గాన్ని ఆకట్టుకోవడానికి.. పదేళ్ల పాలనతర్వాత కూడా.. ఉద్యోగానికి రాజీనామా చేయించి మరీ ఒక నాయకుడిని పార్టీకోసం అరువు తెచ్చుకోవాల్సి వస్తున్నదంటే.. ముదిరాజ్ వర్గంలో ఆ పార్టీ పట్ల ఇన్నాళ్లూ ఉన్న విశ్వసనీయత ఏపాటిది? అనే చర్చ జరుగుతోంది.

అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ఉద్దేశంతోనే.. కేసీఆర్ టీఎన్జీవో సంఘ నాయకుడు మామిళ్ల రాజేందర్ ను పిలిచి పెద్దపీట వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. కేవలం ముదిరాజ్ కులం కావడం మాత్రమే కాకుండా, ఉద్యోగ వర్గాలను భారాసకు అనుకూలంగా మార్చడానికి కూడా ఆయన ఉపయోగపడతారనేది దళపతి ఆలోచనగా ఉంది. 

ఉద్యోగ వర్గాల్లో కేసీఆర్ పాలన పట్ల అసంతృప్తి ఉంది. గత పీఆర్సీ తాలూకు డీఏ బకాయిలనే పూర్తిగా చెల్లించలేదనే మండిపాటు ఉంది. కొత్త పీఆర్సీ ప్రకటించి కేవలం 5 శాతం మాత్రమే ఐఆర్ ప్రకటించారన్న కోపం ఉంది. వీటన్నింటినీ సర్దుబాటు చేసి, ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకుండా నియంత్రించడానికి ఉద్యోగవర్గాల నాయకుడిని రాజకీయాల్లోకి తీసుకురావడం మేలైన మార్గంగా కేసీఆర్ భావించి ఉండవచ్చు. 

ఆయన సూచన మేరకు మామిళ్ల రాజేందర్ స్వచ్ఛందంగా వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం దానిని ఆమోదించింది. త్వరలోనే ఆయన పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఉద్యోగసంఘాల నాయకులను పార్టీలోకి తెచ్చి పెద్ద పీట వేసిన మాట అందరికీ గుర్తుండే ఉంటుంది.