విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాన్నాళ్ళ తరువాత విశాఖలోని టీడీపీ ఆఫీస్ గడప తొక్కారు. దాంతో ఆయనను సడెన్ గా అక్కడ చూసిన పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురి అయ్యాయి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విశాఖలోని పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.
దాంతో గంటా టీడీపీ ఎమ్మెల్యేగా అక్కడకి వెళ్లారు. అన్న ఎన్టీయార్ కి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావంతోనే ఏపీలో సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడింది అని పేర్కొనడం విశేషం. టీడీపీతోనే ప్రగతి అంతా సాగిందని కూడా చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే గంటా గత రెండేళ్ళుగా పెద్దగా టీడీపీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడంలేదు. అయితే ఆయన ఎన్టీయార్ జయంతి, వర్ధంతి వేళ మాత్రం ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఇక హిస్టారికల్ మైలు రాయిగా నలభయ్యవ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ జరుపుకుంటున్న వేళ గంటా పార్టీ ఆఫీస్ కి రావడంతో సందడి నెలకొంది.
మొత్తానికి చూస్తే గత ఏడాది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకోవాలని చూస్తున్న గంటా టీడీపీ ఆఫీస్ గడప తొక్కారూ అంటే ఆయన రాజకీయ వ్యూహం ఏంటన్నది అర్ధం కావడంలేదు అంటున్నారు.
ఏది ఏమైనా గంటా 2024 ఎన్నికల నాటికి తనదైన రాజకీయంతోనే ముందుకు వస్తారని అభిమానులు అనుచరులు చెబుతున్నారు. ఇక చంద్రబాబు మీటింగుకు పిలిచినా వెళ్ళని గంటా పార్టీ ఆఫీస్ కు వచ్చారంటేనే విశేషంగా చూడాలనే అంటున్నారు.