ఏపీలోనే ఉంటావా! కాస్త క్లారిటీ కావాలి పవన్!!

“నేను ఇక్కడే ఉంటా.. ఏపీలోనే ఉంటా.. మీకు ఎప్పటికీ అండగా ఉంటా.. మీకోసం పోరాడుతూ ఉంటా..'' లాంటి పడి కట్టు సినిమా డైలాగులను జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రతి ఊరి…

“నేను ఇక్కడే ఉంటా.. ఏపీలోనే ఉంటా.. మీకు ఎప్పటికీ అండగా ఉంటా.. మీకోసం పోరాడుతూ ఉంటా..'' లాంటి పడి కట్టు సినిమా డైలాగులను జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రతి ఊరి నుంచి వినిపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు సొంత ఇల్లు లేదు గాని పార్టీ కేంద్ర కార్యాలయానికి మాత్రం ఇటీవలే చాలా ఘనంగా శంకుస్థాపన కూడా చేసిన పవన్ కళ్యాణ్ “ఇక్కడే ఉంటా.. ఇక్కడే ఉంటా” అనే మాటలను రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న ఒక వరం లాగా ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ఏపీలోనే నివాసం ఉండడం అనే వ్యవహారం గురించి ప్రజలు చిన్న క్లారిటీ కోరుకుంటున్నారు. పవన్ మాటలు, గతంలోని అనుభవాల వల్ల వారికి ఆ క్లారిటీ అవసరం అవుతోంది.

ఈ ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రిని అయిపోతా అని ప్రగల్భాలు పలుకుతున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉండాలని అనుకుంటున్నారా అనేది ప్రజల మొదటి సందేహం. లేదా, చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టి తన భుజాల మీద మోసి, ఆయనను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టిన తర్వాత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా కుదురుకుంటే మాత్రమే ఈ రాష్ట్రంలోనే నివాసం ఉండాలని అనుకుంటున్నారా అనేది ప్రజల రెండో సందేహం. లేదా, జనసేన టిడిపి కూటమిని ప్రజలు ఈసారి కూడా చిత్తుగా ఓడించినా కూడా ఆయన రాష్ట్రంలోని నివాసం ఉండాలనుకుంటున్నారా? 

ఎమ్మెల్యేగా కూడా పవన్ కళ్యాణ్ ను గతంలో మాదిరిగా ఓడించినప్పటికీ.. ప్రజల కోసం అండగా ఉండడానికి, పోరాడడానికి ఆయన రాష్ట్రంలోనే నివాసం ఉంటారా? అనే రకాల సందేహాలున్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఎందుకంటే ప్రజల గత అనుభవాలు అలా ఉన్నాయి. ‘నన్ను గాజువాక ఎమ్మెల్యేని చేసి ఉంటే విశాఖలో భూకబ్జాలు అక్రమాలు దోపిడీలు జరగకుండా అడ్డుకొని ఉండేవాడిని’ అని చేతగాని మాటలు పలికే పవన్ కళ్యాణ్ తద్వారా, గెలిపిస్తే మాత్రమే ప్రజలకు అండగా ఉంటా అనే భావాన్ని తెలియజేస్తున్నారు. 

ఓడించినా కూడా ఆయన తన  ప్రజల కోసం పాటుపడతారా అనేది చాలా కీలకమైన విషయం. ఆయన మాట తీరును గమనిస్తే మీరు నన్ను గెలిపిస్తే మాత్రమే నేను మీకోసం పనిచేస్తా అనే అర్థం అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. అదే సమయంలో దానికి విరుద్ధంగా గెలుపోటముల గురించి నేను పట్టించుకోనే పట్టించుకోను. 

నేను ప్రజల మనిషిని. ప్రజలకు మంచి చేయడానికి కష్టపడుతూ ఉంటా అనే సినిమా డైలాగులు కూడా ఆయన వల్లిస్తారు. ఏపీలో నివాసం ఉండడం గురించి ఇప్పుడు పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు అలాంటి ఆలోచన ఎందుకు చేయలేదు అనేది ప్రజలకు కలుగుతున్న కీలకమైన సందేహం.

ఈ వైఖరిని బట్టి చూస్తే తనను ఎన్నికల్లో గెలిపిస్తే మాత్రమే కుర్చీల ఆటలో- తన అవసరం చాలా ఎక్కువగా ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయితే మాత్రమే- లేదా చంద్రబాబు నాయుడుతో జట్టుకట్టి, తాను ఏదో ఒక శాఖకు మంత్రి అయితే మాత్రమే ఆయన ఏపీలో నివాసం ఉండాలనుకుంటున్నారేమో తెలియదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.