రామోజీ ప్రసన్నానికి షార్ట్‌కట్ రూటు ఇదే!

‘పృష్ట తాడనాత్ దంత భంగః’ అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపుమీద తంతే, మూతిపళ్లు రాలాయని దాని అర్థం. ఎక్కడో ఒకడిని టచ్ చేస్తే, వేరే ఎక్కడో దాని తాలూకు రిజల్ట్ కనిపిస్తుందనేది…

‘పృష్ట తాడనాత్ దంత భంగః’ అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపుమీద తంతే, మూతిపళ్లు రాలాయని దాని అర్థం. ఎక్కడో ఒకడిని టచ్ చేస్తే, వేరే ఎక్కడో దాని తాలూకు రిజల్ట్ కనిపిస్తుందనేది ఈ సామెత సారాంశం. 

ఇప్పుడు రాజకీయాల్లో ప్రచారం మీద యావ ఉన్న నాయకులు అనుసరిస్తున్న మార్గం కూడా ఇదే. రామోజీరావును ప్రసన్నం చేసుకోవాలంటే.. ఈనాడులో తమకు మంచి పబ్లిసిటీ దక్కేలాగా వారి గుడ్ లుక్స్ లో ఉండాలంటే.. ఒక షార్ట్ కట్ దారి ఉంది.. అదే మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థను కీర్తించడం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు.

నిజానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో జరుగుతున్నఆర్థిక అవకతవకల మీద జగన్ సర్కారు కత్తి ఝుళిపిస్తోంది. సీఐడీ ఎంక్వయిరీ ముమ్మరంగా సాగుతోంది. ఏ చట్టం కింద చిట్ ఫండ్ సంస్థలు ఏర్పాటు కావాలో.. ఆ చట్టం పట్టించుకోకుండానే ఏర్పాటుచేసినట్టుగా సంస్థ యజమానులే విచారణలో చెబుతున్నారు. 

ఇది చట్టవిరుద్ధం కదా అంటే మాట దాటేస్తున్నారు. వినియోగదారులకు డబ్బులు ఎగవేయడం లేదు కదా.. అనే వాదన తెరపైకి తెస్తున్నారు. డబ్బు ఎగవేస్తున్నారా లేదా? మోసం చేస్తున్నారా లేదా? అనేది వేరే సంగతి. చందాదారుల పట్ల నిజాయితీగా ఉన్నంత మాత్రాన.. చట్టవ్యతిరేకంగా ఉండే వ్యాపారాన్ని అనుమతించాలా? అనేది సీఐడీ ప్రశ్న!

అయితే ఈ ఎపిసోడ్ లో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చాలా నిజాయితీగా వ్యవహారాలు నడుపుతోందని సమర్థించడానికి ఏ దారీ లేదు. కాకపోతే, రామోజీరావును వేధించడం కోసం జగన్ కక్ష పూరితంగా ఇవన్నీ చేయిస్తున్నారనే ఒక్క మాట మాత్రమే వారు అనగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో మార్గదర్శిని సమర్థిస్తూ మాట్లాడే నాయకులకు సహజంగానే ఈనాడు దినపత్రికలో ఎక్కువ మైలేజీ దక్కుతోంది. ఈ కిటుకును తెలుగుదేశం నాయకులు ముందుగానే పట్టుకున్నారు. మార్గదర్శి భజనతో రామోజీరావును ప్రసన్నం చేసుకుని.. చిల్లర నాయకులు కూడా ఎక్కువ మైలేజీ పొందుతున్నారు.

తాజాగా వీరి బాటలో బిజెపి నాయకులు కూడా చేరుతున్నారు. మార్గదర్శి పై దాడులు అంటే.. రామోజీరావుపై కక్షపూరిత చర్యలే అంటూ బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు అంటున్నారు. మార్గదర్శి మీద విచారణ, దాడులు ఎంతోకాలంనుంచి జరుగుతుండగా.. జీవీఎల్ ఇప్పుడే మేల్కొన్నట్టుగా మాట్లాడుతున్నారు. లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కూడా ఇదే పనిచేస్తున్నారు. 

పోనీ వారికి మార్గదర్శి సంస్థ మీద అంత ప్రేమ ఉన్నట్టయితే.. ఆ సంస్థ చట్టప్రకారం ఏర్పాటైందా? కాదా? అనే ఒక్క విషయంలో వారి తరఫున ఆయనే వివరణ ఇచ్చినా కూడా బాగుంటుంది. అగ్రదినపత్రికల్లో ఒకటైన ఈనాడులో తమ స్థాయికి మించిన కవరేజీ పొందడం కోసం వీరంతా మార్గదర్శి భజనలో తరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.