చిరంజీవి మీద పడి ఏడవడం అవసరమా పవన్?

పవన్ కల్యాణ్ ప్రసంగాలను జాగ్రత్తగా గమనిస్తే తన అన్న మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అన్న గురించిన ప్రస్తావన వస్తే.. పవన్ అపరిమితమైన భక్తి ప్రపత్తులను కనబరుస్తారు. …

పవన్ కల్యాణ్ ప్రసంగాలను జాగ్రత్తగా గమనిస్తే తన అన్న మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అన్న గురించిన ప్రస్తావన వస్తే.. పవన్ అపరిమితమైన భక్తి ప్రపత్తులను కనబరుస్తారు. 

అన్నయ్య గురించి మాట్లాడమంటే.. మాకందరికీ అన్నయ్య దేవుడు వంటి పడికట్టు మాటలు వండి వారుస్తారు. కానీ.. రాజకీయ వేదికలు ఎక్కితే.. అన్నయ్యను కూడా తూలనాడడానికి ఆయన వెనకాడరు. రాజకీయంగా చిరంజీవి వైఫల్యాలను ఇండైరక్టుగా అయినా సరే పదేపదే ప్రస్తావించడానికి ఆయన ఉత్సాహపడతారు.

‘‘నీకంటె పెద్దవారిని, నీకంటె గొప్పవారిని నీ ఎదుట చేతులు కట్టుకుని కూర్చుని మాట్లాడేలా చేసే దుర్మార్గుడివి నువ్వు’’ అని పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తిడతారు. ఈ మాటల్లో ఆయన ఉద్దేశం చిరంజీవి- సినిమా ఇండస్ట్రీ తరఫున జగన్ తో మంతనాలకు వెళ్లినప్పుడు ఆయన ఎదుట చేతులు కట్టుకుని కూర్చున్నారన్న ఆక్రోశం మాత్రమే. 

ఆ మాటకొస్తే చిరంజీవి చేతులు కట్టుకుని కూర్చుంటే తప్ప ఆయన మాటలు వింటానని జగన్ అనలేదు, అడగలేదు. అలా చేతులు కట్టుకుని కూర్చోవడం అనేది చిరంజీవికి చాలా సహజమైన లక్షణం. కేరక్టర్ పరంగా ఆయనకున్న ఉన్నతమైన అలవాట్లలో అది ఒకటి. ఆయన మోడెస్టీ అది! చిరంజీవిని కించపరిచేలా పవన్ కల్యాణ్ ఈ మాటలు అనడం అవసరమా? అనేది ఒక ప్రశ్న.

2009 నుంచి రాజకీయాల్లో ఉండే ఉంటే గనుక.. జగన్ ను అసలు సీఎం కానిచ్చేవాడినే కాదు.. అనేది పవన్ పలికే మరో ప్రగల్భం. ఇది కూడా చిరంజీవి వైఫల్యాన్ని నిందించేదే. ఆ మాటకొస్తే.. 2014నుంచి రాజకీయాల్లో ఉండి పవన్ ఏం చేయగలిగారు. ఆయన మహానుభావుడే అనుకుంటే.. చంద్రబాబు పల్లకీ మోసి, 2014లో జగన్ సీఎం కాకుండా అడ్డుకున్నారు. అదే పని 2019లో కూడా చేసి ఉండొచ్చు కదా. 

అత్యాశకు పోయి.. తన పార్టీ ఒంటరిగా నిలబడితే.. జనం వెల్లువలా ఓట్లేస్తారని, తాను ఏకపక్షంగా సీఎం అయిపోతాననే దురాశతో చేతులు కాల్చుకున్నాడు పవన్. అలాంటి దురాశ నిండిన బుద్ధులు.. 2009 నుంచి ఉన్నా ఒకటే.. 2014 నుంచి ఉన్నా ఒకటే. చేయగలిగేది ఏమీ ఉండదు.

కన్నబాబు విషయంలో తాము ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి తప్పు చేశాం అని కూడా అంటున్నారు పవన్. ఆ మాటకొస్తే కన్నబాబు రాజకీయ నాయకుడిగా ప్రజురాజ్యం పార్టీలోకి అడుగుపెట్టలేదు. వ్యూహరచనలు, విధానాలరూపకల్పనకు చిరంజీవికి సాయపడగల మేధావిగా మాత్రమే అప్పటికి సీనియర్ జర్నలిస్టు అయిన కన్నబాబు పార్టీలోకి వచ్చారు. 

ఆయన తొలినుంచి రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కూడా కాలేదు. ఆయన పార్టీకి చేసిన సేవలకు రుణం చెల్లించుకోవడానికి అన్నట్టుగా చిరంజీవి కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చారు. ఆయన నెగ్గారు. ఆ మాటకొస్తే ప్రజారాజ్యం తరఫున 18 మంది నెగ్గారు. అందరూ సమానంగా ఎదగలేదు కదా? ఎవరికి వారు.. వారి కష్టాన్ని బట్టి ఎదిగారు.. రాజకీయాలనుంచి అంతర్ధానం అయిపోయారు? కన్నబాబు అలా తాను ఎదిగిన వారిలో ఒకరు. ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏడుస్తూ.. తన అన్న చిరంజీవి తప్పు చేశాడని ఇప్పుడు గగ్గోలు పెట్టడం ఎందుకు?

పవన్ కల్యాణ్ తాను ఈసరికే హోం మంత్రి అయిపోయి ఉండాల్సిందని, తన అన్న రాజకీయాలనుంచి విరమించుకోవడం వలన ఆ చాన్స్ మిస్సయిందని ఊహించుకుంటున్నట్టుగా ఉంది. అందుకే అన్నయ్య చిరంజీవి వైఫల్యాలను డైరక్టుగాను, ఇండైరక్టుగానూ ప్రస్తావించి విలపిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.