అయినా సరే ఆ రైటర్ అహంకారం వీడలేదు!

ఆదిపురుష్ సినిమా.. కాస్త విజ్ఞత, రామాయణం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి నుంచి తీవ్రమైన దూషణలను ఎదుర్కొంటూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా సంభాషణలు ఈ చిత్రాన్ని ఎక్కువగా భ్రష్టు పట్టించాయి. …

ఆదిపురుష్ సినిమా.. కాస్త విజ్ఞత, రామాయణం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి నుంచి తీవ్రమైన దూషణలను ఎదుర్కొంటూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా సంభాషణలు ఈ చిత్రాన్ని ఎక్కువగా భ్రష్టు పట్టించాయి. 

పాత్రల లక్షణాలు, పాత్రల, సందర్భాల యొక్క ఔచిత్యం పట్టించుకోకుండా.. ఎడాపెడా రెగులర్ యాక్షన్ సినిమాకు రాసినట్టు రాసుకుపోయిన ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా, ఇన్ని విమర్శలు వస్తున్న తర్వాత కూడా తన తీరును సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రత్యేకించి కొన్ని డైలాగులు.. సినిమానే భ్రష్టు పట్టిస్తుండగా వాటిని మార్చనున్నట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. అయితే చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టుగా, అసహ్యమైన డైలాగులు రాసి, వాటిని మార్చవలసి వచ్చినా కూడా.. సదరు రచయిత మాత్రం అహంకారాన్ని వీడకపోవడం గమనించాల్సిన సంగతి.

‘ఆదిపురుష్ కోసం నేను 4000 లైన్లు డైలాగులు రాశాను. వాటిలో 5 లైన్లు కొందరిని బాధించాయని తెలుస్తోంది. రాముడిని, సీతమ్మను కీర్తించిన చాలా సంభాషణల కంటె ఇవే బాధించాయని అనిపిస్తోంది. నా సోదరులు నన్ను ఘోరంగా విమర్శిస్తున్నారు’ అంటూ మనోజ్ ట్వీట్లో చెప్పుకొచ్చారు. ఈ మాట దగ్గరే ఆయన అజ్ఞానం బయటపడుతోంది. 

రామాయణం వంటి చిత్రానికి డైలాగులు రాసినప్పుడు.. వాటిని సంఖ్యాపరంగా ఎన్ని లైన్లు అనే తూకంతో చూస్తే కుదరదు. ఆయన చెప్పింది నిజమే అయినా, కేవలం ఆ అయిదు లైన్లే.. నాలుగువేల లైన్ల సారాంశాన్ని సర్వనాశనం చేసేసాయని ఆయన ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారో అర్థం కాని సంగతి.

‘కడివెడు పాలకైనా ఒక్క విషపు చుక్క’ చాలు అనే సామెత మనకు ఉండనే ఉంది. ‘గుడ్డ నీ బాబుది, చమురు నీబాబుది. తగలబడేది కూడా నీ బాబుదే’ వంటి చవకబారు డైలాగులు రాసి.. మా అమ్మమ్మ నానమ్మలు ఇలాగే నాకు చిన్నప్పుడు కథ చెప్పారు.. అని చీప్ గా సమర్థించుకున్న రచయిత మనోజ్ తన 5 లైన్ల డైలాగులు విషపుచుక్క వంటివని గుర్తించాలి. ఆయనను రాముడిని కీర్తిస్తూ డైలాగులు రాయాలని ఎవరూ అడగడం లేదు. రామాయణంలో ఎలా ఉంటే అలా రాయాలని మాత్రమే కోరుకుంటున్నారు.. పొగిడినా సరే.. యథేచ్ఛగా వక్రీకరించి రాయడం కరెక్టు కాదని అంటున్నారు.

‘మూడు గంటల సినిమాలో మూడు నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేస్తున్నారు’ అని మనోజ్ ముంతాషిర్ శుక్లా వాపోతున్నారు. ఈ మాటలే ఆయన అహంకారానికి పరాకాష్ట. ప్రజల ఊహలకు భిన్నంగా రాయడం కాదు బాబూ.. తమరు రామాయణంలో ఉండే మౌలికమైన స్ఫూర్తికి భిన్నంగా, ఆ స్ఫూర్తిని కించపరిచేలా రాసినందుకే మా బాధ అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 

వాల్మీకి రామాయణాన్ని తమకు చిత్తమొచ్చిన రీతిగా వక్రకరించేసి.. సనాతన సేవ చేసేందుకే ఈ సినిమా తీశాం అనడం ఇంకో బుకాయింపు. ప్రజలు ఛీత్కరిస్తున్నప్పుడు.. వారి తీర్పునకు విలువ ఇవ్వడం అవసరం. అయితే ఈ రచయిత మాత్రం.. డైలాగులు మారుస్తున్నాం అంటూనే.. అహంకార పూరితంగా ట్వీట్లు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.