ప్రతి ఎన్నికకు ఓ లెక్క చెప్పడం, బరి నుంచి తప్పుకోవడం జనసేనాని పవన్‌కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శలు న్నాయి. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకునేందుకు ఎలాంటి సాకులు చెబుతారోననే ఉత్కంఠ, భయం జనసైనికులను వెంటాడుతోంది.
తిరుపతి ఉప ఎన్నిక ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండురోజుల తిరుపతి పర్యటన నిమిత్తం జనసేనాని పవన్‌కల్యాణ్ నేటి సాయంత్రం అక్కడికి వెళుతున్నారు.
ఈ రోజు సాయంత్రం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అలాగే రేపు ఉదయం 11 గంటలకు మీడియా మీట్ నిర్వహించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన -బీజేపీ కూటమి అభ్యర్థిపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మరో వైపు బీజేపీ మాత్రం చాప కింద నీరులా తామే బరిలో నిలిచేందుకు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది. కమిటీలను కూడా ఎంపిక చేసే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు.
పవన్‌కల్యాణ్ ఆరంభశూరత్వం గురించి అందరికీ తెలుసనని, మొదట్లో ఆయన ఏదో అంటారని, ఆ తర్వాత తమ నేతలు మాట్లాడితే మెత్తబడతారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. గతంలో కూడా అమరావతి పర్యటనలో పవన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని గొప్పగా చెప్పారని, చివరికి ఏమైందో అందరికీ తెలుసునని గుర్తు చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్‌కల్యాణ్‌ను బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ వెళ్లి కలవగానే అంతా తుస్సుమని పించారు. తగిన సమయం లేకపోవడంతో పాటు కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా పొత్తు పెట్టుకోలేకపోయామని పవన్ నాడు చెప్పారు.
ప్రధానంగా హైదరాబాదులో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే తమ కార్యకర్తలకు ఇష్టంలేకపోయినా జీహెచ్ఎంసీ బరి నుంచి తప్పుకుంటున్నామని పవన్ చెప్పడాన్ని నేడు బీజేపీ నేతలు, కార్యకర్తలు తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో గుర్తు చేయడం విశేషం.
ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని నాడు పవన్ పిలుపునిచ్చారని, తాజా పర్యటనలో కూడా అలాంటి పిలుపే పవన్ నుంచి వస్తుందని చెబుతున్నారు. జనసైనికుల భయం కూడా అదే కావడం గమనార్హం.