టీడీపీ మాజీ చీఫ్ కళా వెంకట్రావు అరెస్ట్, మరో మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్ట్, ఇంకో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్ ఇటీవల కాలంలో వరుసగా టీడీపీ నేతలు ఏదో ఒక విషయంతో హైలెట్ అవుతూనే ఉన్నారు, పోలీస్ కేసులు, అరెస్టుల వరకూ వెళ్తున్నారు.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? టీడీపీ నేతలు కావాలనే రెచ్చిపోతున్నారా, వారి వాలకం చూసి వైసీపీ నేతలే రెచ్చిపోయి కేసులు పెడుతున్నారా..? అరెస్ట్ లతో పచ్చ చొక్కాలపై సింపతీ పెరుగుతుందా..? వరుస సంఘటనలతో ఓరకమైన ఉద్విగ్న వాతావరణం మాత్రం ఏపీలో నెలకొంది.
పసుపు వర్సెస్ ఖాకీ..
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేని టీడీపీ పరోక్షంగా పోలీస్ డిపార్ట్ మెంట్ ని టార్గెట్ చేసింది. పదే పదే పోలీసులపై నిందలు వేస్తూ వారిని రెచ్చగొడుతోంది.
రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా ప్రభుత్వం తప్పేనని, పరోక్షంగా పోలీసుల తప్పేనంటోంది. ప్రభుత్వానికి తొత్తులు, వైసీపీ కండువాలు కప్పుకున్నారు, పార్టీ మనుషులు అంటూ కించపరిచే మాటలు వీటికి అదనం.
ఇలా పోలీసుల్ని రెచ్చగొట్టడం ఓ వైపు, అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల్ని తిట్టడం మరోవైపు.. పూర్తిగా సింపతీ కోసం పాకులాడుతున్నారు టీడీపీ నేతలు-కార్యకర్తలు. తప్పులు చేసి అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అఖిల ప్రియ కేసులు వేరు. తప్పులు చేసేందుకే అరెస్ట్ అవుతున్న తాజా కేసులు వేరు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణి..
టీడీపీలో గుర్తింపు కోసం పాకులాడుతున్న చాలామంది ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసి, రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడి, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టి నానా హంగామా చేస్తున్నారు. చంద్రబాబు దృష్టిలో పడాలనుకున్నవారు, కాస్త జనం నోళ్లలో నానాలనుకుంటున్న వారంతా సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకుంటున్నారు.
కనీసం ముఖ్యమంత్రి, మంత్రి అనే గౌరవం లేకుండా ఏక వచనంతో సంబోధించడం, వీలైతే నాలుగు తిట్లు తిట్టడం(బూతులు కంపల్సరీ), సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం.. ఇదీ వారి పని. ఇలాంటి బ్యాచ్ పై ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టారు. పాపం పండిన తర్వాత ఒకేసారి అందర్నీ బొక్కలో తోసే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏది జరిగినా తిరుపతికే లింకు..
రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా తిరుపతికే లింకు పెడుతూ మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. రామతీర్థంలో దారుణం జరిగింది-తిరుపతిలో వైసీపీని ఓడించండి. రైతులు కష్టాలు పడుతున్నారు-తిరుపతిలో వైసీపీని ఓడించండి.
బీసీ నేత కళా వెంకట్రావుని అరెస్ట్ చేశారు-తిరుపతిలో బీసీల సత్తా చూపండి. టీడీపీ నేతల్ని చంపేస్తున్నారు-తిరుపతి గెలుపుతో వైసీపీకి బుద్ధి వచ్చేలా చేయండి. ఇలా ఉంటున్నాయి పచ్చ పార్టీ స్లోగన్లు.
వీటిలో ఏ ఒక్కదానిలో వైసీపీ ప్రమేయం లేదు కానీ.. తిమ్మిని బమ్మిని చేస్తూ అనుకూల మీడియాతో రచ్చ చేస్తూ తిరుపతి ఉప ఎన్నికలకు విద్వేష రాజకీయ రణరంగాన్ని సిద్ధం చేస్తోంది టీడీపీ. అయితే ఒకటి మాత్రం నిజం. ఇలా అరెస్ట్ లతో హీరోలవ్వాలనుకుంటున్న టీడీపీ నేతలంతా జీరోలుగా మిగలడం మాత్రం ఖాయం.