ఇటీవల చంద్రబాబులో వచ్చిన వైఖరితో మైనార్టీలకు ఆ పార్టీ క్రమంగా దూరమవుతోంది. మరోవైపు బాబు వైఖరిని సమర్థించేందుకు టీడీపీ మైనార్టీ నాయకులెవరూ ముందుకు రావడం లేదు. పైగా క్రిస్టియన్లపై ఇటీవల చంద్రబాబు చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగాల కార్యవర్గాలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ గతుక్కుమంది.
ఈ నేపథ్యంలో టీడీపీలో క్రిస్టియన్ నేతగా ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఒక్కరే మిగిలారు. తాజాగా ఆమె మైనార్టీల్లో నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇందులో భాగంగా చంద్రబాబు క్రిస్టియన్లపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు చెప్పడం గమనార్హం.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ను దూషిస్తూనే, మరోవైపు బాబు వైఖరిని వెనుకేసుకొచ్చేందుకు సర్కస్ ఫీట్లు వేయడాన్ని చూడొచ్చు.
మతోన్మాదంతో వ్యవహరించేది ఎవరు? మత సామరస్యం కోసం వ్యవహరించేది ఎవరో గుర్తించాలని దివ్యవాణి అభ్యర్థించారు. ఎప్పుడూ అనని మాటలను చంద్రబాబు ఎందుకు అంటున్నారో… ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయో అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.
చంద్రబాబు మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే ఆయన తరఫున తాను క్షమాపణ కోరుతున్నానని దివ్యవాణి అనడం గమనార్హం. అంతే తప్ప బాబు మాత్రం మైనార్టీల మనోభావాలను పరిగణలోకి తీసుకుని క్షమాపణ చెప్పేందుకు ముందుకు రారని ఆమె పరోక్షంగా తేల్చి చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాబు తరపున క్షమాపణలు చెప్పడానికి ఇంతకూ ఈమెకేం సంబంధమని మైనార్టీలు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పక్కా ప్రణాళికతోనే మైనార్టీలను కించపరిచేలా మాట్లాడుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు.
ఇదే దివ్యవాణి ఈ నెల మొదటి వారంలో టీడీపీ నూతన రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడిన అంశాల్ని మైనార్టీలు గుర్తు చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు సమక్షంలో దివ్యవాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మతాన్ని ఎత్తిచూపే బదులు ఆయన ప్రవర్తనను తప్పు పడితే బాగుంటుందని సూచించడాన్ని మైనార్టీలు గుర్తు చేస్తున్నారు.
అంటే చంద్రబాబు మాట్లాడుతున్నది తప్పని దివ్యవాణి అంతరాత్మకు తెలుసని, పార్టీలో ఉంటూ మానసికంగా కుంగిపోతున్నట్టు ఆమె మాటలే ప్రతిబింబిస్తున్నాయని మైనార్టీలు చెబుతున్నారు. మైనార్టీల మనోభావాలను దెబ్బ తీసిన తర్వాత దివ్యవాణి క్షమాపణ ఎవరికి కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా మైనార్టీలపై బాబుకు ప్రేమే ఉంటే, క్షమాపణ చెప్పే వారంటున్నారు.