నైజాం ఏరియాలో పండగ సినిమాలకు థియేటర్ల వివాదం ముగిసిపోలేదు. ఇంకా కొనసాగుతోంది. ఈ రెండు రోజుల్లో అది ముదిరి రోడ్డున పడుతుందో, లేదా సమసిపోతుందో అన్నది తేలిపోతుంది.
అవసరం అయితే రోడ్డు ఎక్కడానికి క్రాక్ నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను డిసైడ్ అయిపోయారు. టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లలో కింగ్ పిన్ శిరీష్ రెడ్డి కి, వరంగల్ శ్రీనుకు మధ్య క్లాష్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు తనకు సారీ చెప్పాలని శిరీష్ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. తనకు అన్యాయం జరిగితే తాను గొంతెత్తానని, దానికి తానెందుకు సారీ చెబుతానని వరంగల్ శ్రీను భీష్మించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ శుక్రవారం నుంచి కూడా క్రాక్ కు థియేటర్లు అందకుండా చేసే ప్రయత్నం ఏదో తెరవెనుక జరుగుతోందని బోగట్టా. దీనిపై డిస్కషన్లు సాగుతున్నాయి.
తనకు ఇప్పుడు కూడా థియేటర్లు ఇవ్వకపోతే, మొత్తం నైజాం మొత్తం మీద అన్ని మల్టీ ఫ్లెక్స్ లు, థియేటర్లలో సినిమా ప్రదర్శన ఆపేసి, రోడ్డు మీదకు వచ్చి, మీడియాను, పెద్దలను న్యాయం కోరతానని వరంగల్ శ్రీను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దీనికోసం ఆయన వివిధ వర్గాల మద్దతును కూడగట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి టాలీవుడ్ చేతులు దాటికి బయటకు వెళ్లిపోకుండా చూడాలని, కొంతమంది పెద్దలు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.