ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జాతీయ పార్టీ బీజేపీకి తోక పార్టీగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండొచ్చు కానీ, గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మాత్రం అది నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే.
కనీసం ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ నీడలా టీడీపీ రాజకీయ ప్రయాణం సాగించడం ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ తమ ట్రాప్‌లోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్ చేస్తే … అందరూ ఏమో అనుకున్నారు. కానీ సోము వీర్రాజు మాటలే నేడు నిజమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాన్ని నిరసిస్తూ తిరుపతిలో నేడు ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో టీడీపీ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా అలిపిరి పాదాల చెంత గురువారం పూజలు నిర్వహించి ప్రచార రథాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు.
ఇదే అలిపిరి సమీపంలోని కపిలతీర్థం టూ రామతీర్థం పేరుతో ఫిబ్రవరి 4 నుంచి రథయాత్రను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు ప్రస్తావిస్తూ …. టీడీపీకి ఒక రాజకీయ ఎజెండా అంటూ లేదని, తమ నీడలా వస్తోందని విమర్శిస్తున్నారు.
టీడీపీ చేపట్టే ధర్మపరిరక్షణ యాత్ర కేవలం తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకే పరిమితం చేయ డాన్ని బీజేపీ తప్పు పడుతోంది. టీడీపీది ధర్మపరిరక్షణ యాత్ర కాదని, ఓటు బ్యాంకు యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని బీజేపీ, వైసీపీ దుయ్యబడుతున్నాయి.
నిజంగా హిందూత్వంపై ప్రేమ, నమ్మకం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రథయాత్ర చేయడం లేదని ఆ పార్టీలు నిలదీస్తున్నాయి. కేవలం తిరుపతి పార్లమెంట్ పరిధిలో మాత్రమే ధర్మానికి విఘాతం కలిగిందని టీడీపీ చెప్పదలుచుకున్నదా అని ఆ పార్టీలు ప్రశ్నిస్తుండడం గమనార్హం.