బండ్ల గణేష్…. టాలీవుడ్‌లో కమెడియన్‌గా ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. నిర్మాతగా స్థిరపడ్డాడు. ఆయనలో సహజ సిద్ధంగానే హాస్య నటుడు ఉన్నాడు. సినిమా ఫంక్షన్‌లో ఆయనలోని సహజ నటుడు బయటికొచ్చి అందరికీ వినోదాన్ని పంచుతుంటాడు. ఇక న్యూస్ చానళ్లలో ఆయన ఇంటర్వ్యూలకు క్రేజ్ వుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన నైజం ఒక వర్గం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.
రాజకీయాల్లో తలదూర్చిన కొత్తలో ….తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. బండ్ల గణేష్ అంటే అనేక అంశాలు గుర్తుకొస్తాయి. ఇందులో చెక్‌బౌన్స్ కేసులు కూడా ఉన్నాయండోయ్.
చెక్‌బౌన్స్ కేసులో ఇవాళ ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యాడు. ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్ల వద్ద దాదాపు రూ.10 కోట్లు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించలేదన్నది అభియోగం. బండ్ల గణేష్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావడంతో ఫైనాన్షియర్లు న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టుకు రావాల్సి వచ్చింది. గతంలో కూడా ఆయన ఇదే కేసులో ప్రొద్దుటూరుకు రావడం తెలిసిందే.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ తనపై కావాలనే కేసులు వేశారని వాపోయారు. తానెవరికీ బాకీ లేనన్నారు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయని బండ్ల గణేష్ చెప్పడం గమనార్హం.