వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, ప్రత్యేకించి బీజేపీ వ్యతిరేక పార్టీల్లో పని చేసిన నేతల పేర్లు.. ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో తరచూ వినిపిస్తూ ఉండటం గమనార్హం! కొన్ని నెలల కిందట ముందుగా శరద్ పవార్ పేరు రాష్ట్రపతి రేసులో వినిపించింది. ఒక దశలో పవార్ ప్రతిపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి రేసులో నిలుస్తారని, కాదు కాదు.. బీజేపీనే పవార్ ను రాష్ట్రపతిగా చేయబోతోందని ఊహాగానాలు వినిపించాయి. అయితే పవార్ వాటిని కొట్టి పడేశారు.
ఇక ఇటీవలే గులాం నబీ ఆజాద్ పేరు ఇదే విషయంలో వినిపించింది. గులాం నబీని రాష్ట్రపతిగా చేసి బీజేపీ సరి కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధిస్తుందనే టాక్ వచ్చింది. మైనారిటీ వ్యతిరేక ముద్రకు మందుగా, ముస్లింను రెండో సారి రాష్ట్రపతిగా చేసిన పార్టీ అనిపించుకోవడానికి బీజేపీ గులాం నబీ పేరును వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందనే ఊహాగానాలు ఇంకా ఉండనే ఉన్నాయి.
ఇటీవలే సోనియాగాంధీతో గులాంనబీ సమావేశం కావడం కూడా చర్చనీయాంశంగా నిలిచింది. బహుశా బీజేపీ గనుక గులాంనబీతో ఈ ప్రతిపాదన పెట్టి ఉంటే… ఆ విషయాన్ని ఆయన డైరెక్టుగా సోనియాకు చెప్పే ఉండవచ్చు! సోనియా, రాహుల్ లతో నబీకి దూరం పెరిగిన నేపథ్యంలో.. బీజేపీ ప్రతిపాదనను ఆయన ఒప్పుకుని ఉండవచ్చు కూడా!
ఆ సంగతలా ఉంటే.. మాయావతికి బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చిందనే ప్రచారమూ జరుగుతోంది. ఇటీవలి యూపీ ఎన్నికల్లో బీఎస్పీ అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. చిత్తు చిత్తుగా ఓడింది. ఈ మేరకు సంఘ్ పరివార్ తో మాయ ఆల్రెడీ ఒప్పందం చేసుకుందని, యూపీలో బీజేపీకి సహకరించి.. రాష్ట్రపతి కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై మాయ స్పందించారు.
అదంతా అబద్ధపు ప్రచారమని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే ఆ ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. తనకు రాష్ట్రపతి పదవిని ఇలా అధిష్టించే ఉద్దేశం లేదని, ఆమె స్పష్టం చేశారు.