తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
పుణ్యక్షేత్రం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసిన చినజీయర్ స్వామిని ఆహ్వానించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, దానికి తనను పిలవకపోవడం ఏంటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా తన అసంతృప్తి, ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
“యాదాద్రి పునఃప్రారంభానికి ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆహ్వానించింది. దేవుడు దగ్గర కేసిఆర్ నీచపు రాజకీయాలు చేయడం బాధాకరం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌పై సీఎంవో స్పందన ఏంటో మరి!