కశ్మీరీ ఫైల్స్ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వాలన్న కాషాయవాదుల డిమాండ్ పై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఆ సినిమాను ప్రజలు వీక్షించాలనే కోరిక ఉంటే, దాన్ని ఎంచక్కా యూట్యూబ్ లో పెట్టుకోవచ్చని సూచించారు. ఆ సూచనపై యథారీతిన కమలం భక్తులు విరుచుకుపడ్డారు.
ఢిల్లీ సీఎం సూచనలో వారికి దేశద్రోహం కనిపించింది. మరి కశ్మీరీ ఫైల్స్ సినిమాను యూట్యూబ్ లో పెట్టాలన్న కేజ్రీవాల్ సూచన దేశద్రోహం అయితే, ఇప్పుడు ఒక కాషాయధారి అదే మాటే అంటున్నారు. ఆయనే రామ్ దేవ్ బాబా.
ఇప్పటి వరకూ కశ్మీరీ ఫైల్స్ సినిమాతో సంపాదించుకున్న డబ్బులు చాలని, తక్షణం ఆ సినిమాను యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేయాలని బాబా రాందేవ్ సూచించారు. పరిమిత బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో సంపాదించుకున్నది చాలని ఈ సినిమాను యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేయాలని బాబా రాందేవ్ అంటున్నారు. ఇదే సూచనే కేజ్రీవాల్ చేస్తే ఆయనది దేశద్రోహం లాగా అనిపించింది. మరి ఇప్పుడు బాబారాందేవ్ అదే మాటే అంటున్నారు.