దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. నేనే (జగన్) లేకపోయి వుంటే అని మేకపాటి గౌతమ్‌రెడ్డి గురించి తలచుకుని ఆవేదన చెందారు. నెల్లూరు రూరల్ పరిధి కనుపర్తిపాడులోని వీపీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభకు జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ తన ప్రియ మిత్రుడితో పెనవేసుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
గౌతమ్ లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోవడంతో పాటు నమ్మలేకపోతున్నట్టు జగన్ చెప్పారు. గౌతమ్ భౌతికంగా లేరనే విషయాన్ని నమ్మడానికి మనసుకు ఎంతో కష్టంగా ఉందన్నారు. గౌతమ్ గురించి ఎంత చెప్పినా ఆయన లేని లోటు తీరనిదన్నారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అన్నారు. ఆ కుటుంబానికి తానే కాదు.. వైఎస్సార్‌సీపీ మొత్తం తోడుగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే….
“నేను లేకపోయి వుంటే బహుశా గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో. అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పార్టీతో యుద్ధం ప్రారంభమైంది. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాకు మద్దతుగా నిలిచేందుకు గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యమే కారణం. నా వైపు రాజమోహన్‌రెడ్డి ఉండేందుకు గౌతమ్ ఒత్తిడే పని చేసింది. 2009 నుంచి ప్రతి అడుగులోనూ గౌతం నాకు తోడుగా, స్నేహితుడిగా ఉన్నాడు.
గౌతమ్‌రెడ్డి నాకంటే ఒక సంవత్సరం పెద్దోడు. అయినా ఆ గర్వం కనిపించేది కాదు. నన్నే అన్నగా భావించేవాడు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. రాజకీయాల్లో మంచి నాయకుడిగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంచి మంత్రిగా కొనసాగాడు. చివరి క్షణం వరకూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడ్డాడు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచన మేరకు కళాశాలను అగ్రికల్చర్ కాలేజ్‌గా, అవసమైతే యూనివర్సిటీగా మారుస్తాం.
గౌతమ్ చిరకాల కాంక్ష వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం. మే 15వ తేదీలోపు సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేస్తాం. ఆ బ్యారేజ్‌కి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడ్తాం” అని జగన్ ప్రకటించారు.