గత ఎన్నికల వరకు రాజకీయ నాయకులకు ఆప్షన్లు ఉండేవి. టీడీపీ కాదంటే వైసీపీలోకి, వైసీపీ కాదంటే టీడీపీలోకి జంప్ కొట్టేవారు. కానీ ఈసారి అలాంటి బ్యాక్ డోర్స్ కనిపించడం లేదు. ఎందుకంటే., రెండు పార్టీల్లో బెర్తులు ఖాళీగా లేవు. ఆహ్వానాలు అస్సలుకే అందడం లేదు.
వైసీపీలో బోలెడంత మంది నాయకులున్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో, రాబోయే ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో ఎవరికైనా అన్యాయం జరిగితే.. అలాంటి వాళ్లు టీడీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఒకరిద్దర్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబుకు ఇబ్బంది లేదు. అంతకంటే ఎక్కువమంది వస్తే మాత్రం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోతాయి.
టీడీపీకి దబిడి దిబిడే..
2014లో వచ్చిన వాళ్లందర్నీ చేర్చుకున్నారు చంద్రబాబు. గెలిచిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యేల్ని సంతలో గొర్రెల్ని కొన్నట్టు కొనుగోలు చేశారు. 2024కు వచ్చేసరికి మాత్రం ఆ సీన్ రిపీట్ చేయలేరు. ఎందుకంటే, టీడీపీలో కూడా ఆశావహులు, మరీ ముఖ్యంగా వారసులు టికెట్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ నుంచి నిలబడేవాళ్లలో చాలామంది గెలవలేకపోవచ్చు. కానీ తమకు టికెట్ దొరక్కపోతే మాత్రం పార్టీకి మరింత డ్యామేజీ చేయగల సత్తా మాత్రం వీళ్లకు ఉంది.
అందులోనూ జనసేన, బీజేపీతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఈ దశలో వైసీపీ అసంతృప్తులను మచ్చిక చేసుకున్నా టికెట్ గ్యారెంటీ అని చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ముందుగా అలాంటి హామీలిస్తే.. ఆ తర్వాత పొత్తులతో చిత్తయ్యేది బాబే. అందుకే ఇప్పటికిప్పుడు ఎవరికీ హామీ ఇవ్వడంలేదు, కేవలం తెరవెనక కొన్ని సంప్రదింపులు మాత్రం జరుగుతున్నట్టు సమాచారం.
వైసీపీ సంగతేంటి..?
ఇక వైసీపీ విషయానికొద్దాం. టీడీపీలో టికెట్ దొరకని వాళ్లు వైసీపీ వైపు వచ్చేలా లేరు. చివరి నిముషంలో పార్టీ మారినవారి పరిస్థితి వైసీపీలో ఎలా ఉంటుందో అందరికీ అర్థమైపోయింది. కష్టకాలంలో తనకు అండగా నిలిచినవారికే జగన్ ఆశీస్సులున్నాయి. పోనీ భవిష్యత్తుపై ఆశలతో చాలామంది గోడదూకొచ్చు. కానీ ఇప్పుడా ఆశలు కూడా లేవు. ఉన్నవారికే సీట్లు సర్దుబాటు చేయలేక సర్ది చెప్పుకోలేని పరిస్థితి వైసీపీలో ఉంది.
ఇక్కడ ఆల్రెడీ పోటీ తీవ్రంగా ఉంది. మరో నేతకు చోటిచ్చే పరిస్థితి లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీలో ఇదే పరిస్థితి ఉంది.
అందరూ నాయకులే..
గతంలో గ్రామస్థాయి నాయకులెవరు, మండల స్థాయి ఎవరు, జిల్లా స్థాయి ఎవరు అనేది ఇట్టే అర్థమయ్యేది. కానీ ఇప్పుడు రావడం రావడమే.. ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నంతగా బిల్డప్ ఇచ్చేస్తున్నారంతా. సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న పెద్ద గల్లీ లీడర్లంతా అసెంబ్లీ టికెట్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఖద్దరు చొక్కా క్రేజ్ పెరిగిపోవడంతో, కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఈ దశలో అన్ని పార్టీలకు ఈ చిక్కు ఉంది. అసంతృప్తులంతా అదే పార్టీలో ఉండి రగిలిపోవాల్సిందే కానీ, పార్టీ మారి టికెట్ దక్కించుకునే అవకాశం లేదు.