తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మాటికీ తమ శత్రువే అని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్. ఒక ఆంగ్ల వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుతో తాము చేతులు కలిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సొంతంగా ఓడించగలమని.. దీని కోసం చంద్రబాబుతో చేతులు కలపాల్సిన అవసరం లేదన్నట్టుగా దేవధర్ అన్నారు. చంద్రబాబుతో చేతులు కలిపితే తాము ఓడిపోతామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఒకవైపు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నడూ లేని హిందుత్వ అజెండాను భుజాన వేసుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడి వ్యూహం బీజేపీకి దగ్గర కావడమే అని స్పష్టం అవుతూ ఉంది.
ఎలాంటి రాజకీయం చేసినా అతిగా చేసే అలవాటున్న చంద్రబాబు నాయుడు.. బీజేపీకి దగ్గర కావడంలో కూడా ఆ అతి పోకడలనే అనుసరిస్తూ ఉన్నారు.
దీని కోసం క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు విధ్వంసం సృష్టించి అధినేత రాజకీయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేవధర్ తిరుపతి ఉప ఎన్నికలు, ఏపీ రాజకీయం గురించి మాట్లాడారు.
తమకు పవన్ కల్యాణ్ మిత్రుడు అని అన్నారు. పోవాలి చంద్రబాబు- జగన్ , రావాలి సోము- పవన్ అని నినాదాన్ని ఇచ్చారు సునీల్ దేవధర్. జగన్ కూడా తమకు శత్రువే అని స్పష్టం చేసిన ఈ బీజేపీ నేత, చంద్రబాబు నాయుడు మాత్రం ముమ్మాటికీ శత్రువే అని మూడు సార్లు ఎనిమీ అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే చంద్రబాబుతో చేతులు కలిపే ప్రసక్తి ఉండదని పలు సార్లు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా బీజేపీ ఇన్ చార్జి మాట్లాడుతూ.. చంద్రబాబు మీద ఘాటుగానే స్పందించారు.