తాము తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు వాయిదా వేయడానికి రెడీ అని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రైతు సంఘాలతో చర్చల సందర్భంగా ఈ చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందట ప్రభుత్వం. అయితే ఈ ప్రతిపాదన పట్ల రైతు సంఘాలు ఇంకా స్పందించలేదు.
ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మరోసారి చర్చల సందర్భంగా రైతు సంఘాలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.
మోడీ ప్రభుత్వం వెచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలి.. అనేది రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్. ఈ విషయంలో సవరణలూ, సంప్రదింపులూ మరేం అవసరం లేదని, చట్టాలను వెనక్కు తీసుకుని, మద్దతు ధర కల్పన విషయంలో చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు రోడ్డెక్కారు.
మద్దతు ధర సంగతెలా ఉన్నా.. చట్టాల మీదే పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో రైతులను మిస్ గైడెడ్ గా అభివర్ణిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ చేరిన ఉద్యమం తీవ్రమైన చలిని, కఠిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొనసాగుతూ ఉంది.
మరోవైపు అనేక దఫాలుగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాలపై స్టే విధించింది. ఆ తరహాలో స్టే విధింపు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వ్యాఖ్యానించినా స్టే విధించింది న్యాయస్థానం.
ఈ క్రమంలో చర్చలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా మోడీ ప్రభుత్వం తను తెచ్చిన చట్టాల విషయంలో ఏడాదిన్నర పాటు వెనక్కు తగ్గడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందట. మరి ఇందులో అంతరార్థం ఏమిటో సామాన్యులకు అంతుబట్టదు.
చట్టాల్లో లోపాలు ఉన్నాయనుకుంటే అవి ఏడాదిన్నర తర్వాత కూడా అమలు చేయడానికి వీల్లేదు. చట్టాల్లో సవరణలు అవసరం లేదని, చట్టాలనే వెనక్కు తీసుకోవాలని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
రైతులు మిస్ గైడెడ్ గా అభివర్ణిస్తున్న కేంద్రం, మోడీ భక్తులు.. ఈ విషయంలో రైతులను తమకు చేతనైతే గైడ్ చేయాలి. రైతులేమో పట్టిన పట్టును విడవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఏడాదిన్నర పాటు చట్టాల అమలును ఆపడానికి రెడీ అంటోంది ప్రభుత్వం. మరి ఆ ఆపేదేదో ఆ చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకుంటే.. రైతులు అయినా ఆనందిస్తారు కదా!
అలా కాకుండా ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇవే చట్టాలను తెస్తే.. అప్పుడైనా మళ్లీ రైతులు సమ్మతిస్తారా? అప్పుడు మళ్లీ ఇదే తరహా నిరసనలు ఉద్యమం వల్ల అందరికీ నష్టమే కదా! ఏడాదిన్నర వ్యవధికి వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత పోతుందనేది ప్రభుత్వ వ్యూహమా? అప్పుడు రైతులకు మళ్లీ ఉద్యమం చేసేంత ఓపిక ఉండదనే లెక్కలా!