మహేష్ ఇలా కష్టపడతాడా? రాజమౌళి ఒప్పించగలడా?

తమ ఒళ్లు హూనం చేశాడని, వరుసగా రీటేక్స్ చేయిస్తూ తమ శరీరాలతో చెడుగుడు ఆడుకున్నాడని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లబోదిబోమన్నారు. మరీ ముఖ్యంగా నాటునాటు సాంగ్ లో సింక్…

తమ ఒళ్లు హూనం చేశాడని, వరుసగా రీటేక్స్ చేయిస్తూ తమ శరీరాలతో చెడుగుడు ఆడుకున్నాడని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లబోదిబోమన్నారు. మరీ ముఖ్యంగా నాటునాటు సాంగ్ లో సింక్ కోసం జక్కన్న తమను చిత్రహింస పెట్టాడని వాపోయారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్టు కింద మహేష్ బాబు హీరోగా సినిమా చేయబోతున్నాడు మరి.

తన సినిమాల్లో మహేష్ బాబు ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. భారీ ఫైట్ చేసినా చొక్కా నలగదు. కనీసం ఫైట్స్ లో హీరో బెండ్ కూడా అవ్వడు. చివరికి పొలంలో దిగినా షర్ట్ కు బురద అంటదు. అంతా స్టయిలిష్ గా ఉంటుంది వ్యవహారం. అటు చూస్తే రాజమౌళి సినిమాల్లో హీరోలు తెగ కష్టపడుతుంటారు. మరి రాజమౌళి మార్క్ హీరోకు, మహేష్ బాబు మేనరిజమ్స్ కు సింక్ కుదురుతుందా?

కేవలం ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు, రాజమౌళి తీసిన ప్రతి సినిమాలో హీరోకు శారీరక కష్టం తప్పదు. బాడీ బిల్డింగ్ నుంచి రీషూట్స్ వరకు రాజమౌళి హీరోల్ని ఓ పట్టాన వదలడు. పెర్ఫెక్షన్ కోసం రాచి రంపాన పెడతాడనే టాక్ ఉంది. మరి మహేష్ బాబును అలా తన దారిలోకి తెచ్చుకోగలడా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడ మహేష్ వైపు నుంచి కూడా ఓ మాట చెప్పుకోవాలి.

సబ్జెక్ట్ ఓకే అయి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబు దర్శకుడి మాట తప్ప ఇంకెవ్వరి మాట వినడనే టాక్ ఉంది. దర్శకుడు ఏం చెబితే అది గుడ్డిగా చేస్తాడనే ఇమేజ్ ఉంది. కాబట్టి ఈ విషయంలో రాజమౌళికి మహేష్ నుంచి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎటొచ్చి శారీరక శ్రమ విషయానికొచ్చేసరికి మాత్రం రాజమౌళి-మహేష్ కూర్చొని ఓ మాట అనుకుంటారేమో.