ఇంకా 4 రోజులే.. చలాన్లు కట్టాలంటున్న పోలీసులు

తెలంగాణ పోలీసులు ప్రకటించిన బంపరాఫర్ మరో 4 రోజుల్లో ముగుస్తోంది. 31వ తేదీ దాటితే ట్రాఫిక్ చలాన్లలో డిస్కౌంట్లు ఇక ఉండవు. దీంతో పోలీసులు మరోసారి భారీ ప్రచారం అందుకున్నారు. మిగిలింది ఈ 4…

తెలంగాణ పోలీసులు ప్రకటించిన బంపరాఫర్ మరో 4 రోజుల్లో ముగుస్తోంది. 31వ తేదీ దాటితే ట్రాఫిక్ చలాన్లలో డిస్కౌంట్లు ఇక ఉండవు. దీంతో పోలీసులు మరోసారి భారీ ప్రచారం అందుకున్నారు. మిగిలింది ఈ 4 రోజులే, వీలైనంత త్వరగా చలాన్లు క్లియర్ చేసుకోమని ప్రచారం చేస్తున్నారు. గడువును మరికొన్ని రోజులు పొడిగించే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.

తెలంగాణలో దాదాపు 400 కోట్ల రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు పోలీస్ శాఖ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75శాతం, బస్సులకు 70శాతం, కార్లకు 50శాతం రాయితీని ప్రకటించారు. తెలంగాణ అంతటా కాకపోయినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటివరకు 150 కోట్ల రూపాయలు వసూల్ అయినట్టు పోలీసులు ప్రకటించారు.

మిగిలిన ఈ కొద్ది రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటివరకు చలాన్లు క్లియర్ చేయని వాళ్లు ఎవరైనా ఉంటే వాటిని కట్టేయాలని పోలీసులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా పాటిస్తామని, అవసరమైతే వాహనదారులపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, జైళ్లో కూడా పెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాల్ని పోలీసులు బయటపెట్టారు.

హైదరాబాద్ పరిథిలో ఓ స్కూటర్ యజమానికి అత్యథికంగా 178 చలాన్లు పడ్డాయట. వాటి మొత్తం 48,595 రూపాయలని పేర్కొంది. ఇక మరో బైకర్ కు 73,690 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి వాళ్లంతా రాయితీని ఉపయోగించుకొని చలాన్లు క్లియర్ చేసుకున్నారని.. కేవలం 500 రూపాయలు చలాన్ ఉన్నప్పటికీ దాన్ని క్లియర్ చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

ఓవరాల్ గా తెలంగాణ పరిథిలో 60శాతం చలాన్లను క్లియర్ చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. గ్రేటర్ నుంచి రెస్పాన్స్ బాగున్నప్పటికీ జిల్లాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అదిలాబాద్, కరీంనగర్, మెదక్ లాంటి జిల్లాల నుంచి కనీసం 50శాతం కూడా పెండింగ్ చలాన్లు క్లియర్ అవ్వలేదు. వీటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు గడువును ఇంకాస్త పెంచుతారా, లేక 31వ తేదీతో ముగిస్తారా అనేది చూడాలి.