అనంతపురం టౌన్ పొలిమేరల నుంచి ప్రారంభం అయ్యే రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ విమర్శల, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడు పారిశ్రామికంగా ఈ ప్రాంతం డెవలప్ అవుతోంది. రాప్తాడు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధికి ఆస్కారం ఉండనే ఉంది. బెంగళూరుకు సాగే నేషనల్ హైవే ఇరువైపులా కొత్త ప్రాజెక్టులకు ఆస్కారం ఉంది. కియా ఏర్పాటు, నీటి కరువు చాలా వరకూ.. తీరిపోవడం. ఈ అంశాలు ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇస్తున్నాయి.
రేట్లు ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిపోయినా, భూమి భారీ ఎత్తున అందుబాటులో ఉండటం… కూడా ఒక సానుకూలమైన అంశం. ఆ సంగతలా ఉంటే… ఈ ప్రాంతంలో జాకీ కంపెనీ ఏదో ప్లాంట్ పెట్టే అంశం గురించి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యన మాటల యుద్దం సాగుతోంది.
తెలుగుదేశం హయాంలో జాకీ కంపెనీ ఇక్కడ ప్లాంటు పెట్టే ప్రతిపాదన ఏదో తెచ్చిందట. దానికి అప్పటి ప్రభుత్వంలో గ్రీన్ సిగ్నల్, భూ కేటాయింపులు జరిగాయట. ఇప్పుడు ఆ సంస్థ తమ ప్లాంటు పెట్టడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి పరిటాల సునీత స్పందిస్తూ.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ సంస్థ నుంచి భారీ లంచాన్ని కోరారని, దీంతోనే ఆ సంస్థ అక్కడ నుంచి వెళ్లిపోతోందని ఆరోపించారు.
ఈ అంశంపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా స్పందించారు. ఆ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. దానికి భారీ లబ్ధి కలుగుతోందని, అయినా వారు ఇంకా భూములు అదనంగా కావాలని అంటున్నారని, తాము లంచం అడిగామనేది అబద్ధమని చెబుతున్నారు.
అంతే కాదు..గతంలో సునీత మంత్రిగా ఉన్నప్పుడు ఆ సంస్థ నుంచి భారీగా లంచం తీసుకున్నారని, భూ కేటాయింపులకు గానూ కోట్ల రూపాయలు కొట్టేశారని, ఇప్పుడు ఆ సంస్థ తాము ఇచ్చిన డబ్బులను వెనక్కు అడుగుతుండటం తో సునీత ఇరకాటంలో పడుతున్నారని.. అందుకే తమపై బురద జల్లుతున్నారని.. ప్రకాష్ రెడ్డి ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది.