ఆదిపురుష్ చూసిన వాళ్లు అది రామాయణం కాదు “రౌతాయణం” అంటున్నారు. ఓం రౌత్ తీసిన ఈ కంగాళీ చిత్రానికి ఇంతకంటే వేరే పేరేదీ సూటవ్వట్లేదు మరి.
“స్వర్ణమయీ లంకా” అని స్వయంగా రాముడే లంకని “బంగారు లంక” అని పొగిడాడని వాల్మీకి రాసాడు. కానీ మన రౌత్ లంకని ఒక గబ్బిలాల కోనలాగ చూపించాడు.
లంకాధీశుడు పుష్పకవిమానంలో తిరిగేవాడని యుగాలుగా చెప్పుకుంటుంటే మన రౌత్ వచ్చి ఆ రావణుడిని “గబ్బిలరౌతు”ని చేసేసాడు. ఆ గబ్బిలానికి ఈయనగారు ఎద్దంత మాంసాన్ని ఆహారంగా కూడా పెడుతుంటాడు.
శివలింగం ముందు కూర్చుని స్తోత్రం చేస్తుంటే గొడమీద ఉన్న తన శిల్పాలు కూడా లిప్ మూవ్మెంట్ ఇస్తుంటాయి.
ఒక్క గుద్దుతో కొండల్ని పిండిచేయగల ఈ ఓం రౌత్ రావణాసురుడు వీణ వాయిస్తే మాత్రం వేళ్లు తెగి రక్తమోడేటంత సుకుమారుడు. ఒళ్లు నొప్పులొస్తే పాములతో బాడీ మసాజ్ చేయించుకునే వెరైటీగాడు.
ఒక తలకి పెడితే పది తలలకీ పెట్టాల్సొస్తుందనేమో అసలు రావణాసురుడికి కీరాటాన్నే పెట్టకుండా గ్రాఫిక్స్ బడ్జెట్ ఆదా చేసిన తలతిక్క మేధావి దర్శకుడు ఓం రౌత్.
ఇదొక్కటే కాదు.. శూర్పణఖగా, మండోదరిగా మంచి అందమైన నటీమణుల్ని పెట్టాడు. విభీషణుడి భార్యనైతే స్లీవ్‌లెస్ వేసి అదోలా చూపించాడు. పైగా రంగస్థలం సినిమాలో అనసూయ తడికెల బాత్రూములోంచి పైట సర్దుకుంటూ బైటకొచ్చినట్టు ఈవిడ కూడా రాత్రివేళ గుడారాల మధ్యన బయటికొచ్చి పైట సర్దుకుని భర్త విభీషణుడితో ఏదో డైలాగ్ చెబుతుంది. ఆ ఇద్దరూ మాట్లాడుకునే సీన్ కన్సీవ్ చేయాలంటే మరీ అలా పెట్టాలా? అయినా లక్ష్మణుడు మూర్ఛబోతే విభీషణుడి భార్య సంజీవిని గురించి చెప్పడమేంటి? ఆ ఔషధం వచ్చేదాకా ఆవిడ లక్ష్మణుడికి సపర్యలు చేసి తర్వాత పసరు వైద్యం చేయడమేంటి? ఆ పని చేసింది వానవైద్యుడు కదా! ఇదెక్కడి రౌతాయణం!
అందుకే మరి..కాస్తో కూస్తో రామాయణం తెలిసిన వాళ్లు హాల్లోంచి బయటికొచ్చి ఓం రౌత్ ని అమ్మనాబూతులు తిడుతున్నారు. అసలతనికి రామాయణం గురించి ఏ మాత్రం తెలిసుండదు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగు సినిమాలు, నాలుగు యానిమేషన్ చిత్రాలు చూసి తన పైత్యాన్ని ధారబోసుంటాడు. అందుకే ఏ మాత్రం భక్తిభావం లేకుండా తయారైంది.
అతని అజ్ఞానం వెర్రితలలు వేస్తే వేసింది. ప్రభాస్ కి ఆ మాత్రం తెలీదా? తన గెటప్ నుంచి రావణాసురుడి గెటప్ వరకు ఎలా అఘోరిస్తోందో పట్టించుకోలేదా? అసలు ఓం రౌత్ కి ఏ అర్హత ఉందని ఇంత సెంటిమెంటల్ ప్రాజెక్ట్ అప్పజెప్పారు? తానాజీ అనే సినిమా తీసినందుకా? అసలు రామాయణంలోని బేసిక్ ఎమోషన్ ని పట్టుకోకుండా అత్యంత పేలవంగా తీసాడంటే అతన్ని ఏమనాలి?
అసలు సినిమా ఓపెనింగ్ సీనే ఒక దరిద్రం. మంచు పర్వతాల మధ్యన రావణాసురుడు వెస్టర్న్ హెయిర్ కట్లో, నల్ల దుప్పటి కప్పుకుని తపస్సు చేస్తుంటాడు. ఆ షార్ట్ హెయిర్ కట్ చూస్తే అదే రోజు చేయించుకున్నట్టు ఉంది. అంతలోనే..ఒక్క రోజు తపస్సుకే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏ వరాలు కావాలో కోరుకోమంటాడు. బహుశా చలివల్లనేమో రావణాసురుడికి నోరు పెగలదు. పాపం బ్రహ్మ గారే అతనికి ఏంకావాలో గ్రహించి దేవతలతోటీ, రాక్షసులతోటీ చావు లేకుందా వరమిచ్చేసి వెళ్లిపోతాడు. అంతే కుక్క ఇసకలోంచి లేచి తన శరీరాన్ని విదిలించుకున్నట్టు తన పది తలల్ని ఒకసారి బయటికి తీసి విదిలించుకుని రావణాసురుడు దుప్పటి కప్పుకుని వెళ్లిపోతాడు.
అక్కడి నుంచి చెప్పుకుంటూ పోతే ప్రతి సీను ట్రోలబుల్లే, ప్రతి డైలాగ్ మీమబుల్లే. అంత పెద్దహీరోనిచ్చి, అంత పెద్ద బడ్జెట్ ఇచ్చి తీయమంటే ఒక అధ్వాన్నమైన సినిమాని చేసిచ్చాడు రౌత్. సినిమా ఆడుతోందంటే అది అతని గొప్పతనంకాదు. ప్రభాస్ స్టార్ ఫాక్టర్..అంతకు మించి రామాయణం సెంటిమెంటు.
ఎందరో తల్లిదండ్రులు ఈ సినిమాని తమ పిల్లలకి చూపించాలని నిరీక్షించారు. ఇప్పుడు చూపిస్తే అస్సలు ఎమోషన్ గానీ, భక్తిభావం గానీ కలిగించని ఈ చిత్రమే అసలు రామాయణం కింద వాళ్ల మనసుల్లో నిక్షిప్తమైపోతుందేమోనని భయపడుతున్నారు.
ఇదే సినిమా రాజమౌళి తీసుంటే ఎలా ఉండేదో అంటూ అందరూ అతన్ని తలచుకుంటున్నారంటే ఆలోచించవచ్చు. సినిమా మొత్తంలో జటాయు మరణం దగ్గర, సంజీవిని పర్వతందగ్గర, క్లైమాక్స్ లోనూ ఎమోషనల్ పీక్స్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టేవాడు రాజమౌళి. ఆ సీన్లు మొత్తం సినిమాని మోసేసేవి. అది ఓం రౌత్ కి చచ్చినా చేతకాదని అర్ధమయ్యింది.
రామభక్తి వేవ్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తే ఆనందమే. కానీ ఆ క్రెడిట్ ఈ డి-గ్రేడ్ దర్శకుడికి దక్కేస్తోందనే బాధ మాత్రం ఉంది.
– రాజేశ్వరరావు ద్రోణవల్లి