జనసేనాని పవన్‌కల్యాణ్ ఎన్నికల ముంగిట సరికొత్త డ్రామాకు తెరలేపారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే రీతిలో తనకు లోకేశ్, చంద్రబాబుల నుంచి ప్రాణహాని ఉందని పవన్‌కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు భయాందోళనకు గురై…నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని, హత్యకు ప్లాన్ చేయాల్సిన అవసరం టీడీపీకి లేదని చెప్పిన సంగతి తెలిసిందే.
అప్పట్లో పవన్ పర్యటనలో రాత్రి వేళ కరెంట్ తీసి, తన హత్యకు లోకేశ్ నేతృత్వంలో కుట్ర చేశారని, త్వరలో బండారం బయట పెడతానని పవన్‌కల్యాణ్ ఏవేవో హెచ్చరికలు చేశారు. అప్పట్లో టీడీపీతో విభేదించిన సందర్భంలో పవన్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. తాజాగా వైసీపీపై మరోసారి అలాంటి ఆరోపణలనే పునరావృతం చేయడం చర్చనీయాంశమైంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సుపారీ గ్యాంగ్‌లను దింపారనే సమాచారం వుందని ఆయన అన్నారు. అందువల్ల జనసేన నాయకులు, కార్యకర్తలు భద్రతా నియమాలను పాటించాలని ఆయన కోరారు. తనకు ప్రాణహాని తలపెట్టిందని జనసేన శ్రేణుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా వైసీపీపై వ్యతిరేకత పెంచేందుకు సరికొత్త పంథాను పవన్ అవలంబిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మామూలు విమర్శలు చేస్తే… తన సామాజిక వర్గం ప్రజానీకం పట్టించుకోరనే భయంతో పవన్ ఇలా ప్రాణాలతో మైండ్ గేమ్‌కు తెరలేపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ బలమంతా కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాలకే పరిమితమైంది. అందుకే ఆయన ఆ రెండు జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో ఏ ఒక్కటీ వైసీసీకి రావద్దని గట్టిగా కోరుతున్నారు. జనసేనను ఆదరించాలని మాత్రం ఆయన కోరలేదు. వైసీపీని కాకుండా మరే రాజకీయ పార్టీకి ఓట్లు వేసినా అభ్యంతరం లేదని ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో తనలా ప్రజానీకం కూడా వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించాలంటే… తనను హత్య చేస్తారనే భయాన్ని క్రియేట్ చేయడ మొక్కటే మార్గంగా ఆయన భావించారు. కాపులు బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచేందుకు పవన్‌కల్యాణ్ చావు తెలివితేటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.