జనసేనాని పవన్‌కల్యాణ్ నేలవిడిచి సాము చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జనసేన నాయకుల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినీ నటుడిని కాకపోయి వుంటే బలమైన నాయకుడిగా జనంలోకి దూసుకెళ్లేవాడి నన్నారు. అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందని ఆయన వాపోయారు. పవన్ అజ్ఞానం ఆయన ప్రత్యర్థులు ముచ్చట పడేలా చేస్తుంది. పవన్ బలం, బలహీనత ఆయన అపార అజ్ఞానమే.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని కావడం వల్లే సినీ రంగ ప్రవేశం చేయగలిగాననే స్పృహ ఆయనలో మచ్చుకైనా కనిపించదు. టాలీవుడ్ హీరో కావడం వల్లే తనకు క్రేజ్ వచ్చిందని ఆయన అసలు గుర్తించరు. అసలు తనకు సినీ హీరో కావడం వల్లే ఇమేజ్ వచ్చిందని, అదే రాజకీయాల్లో అడుగు పెట్టడానికి కారణమైందని ఆయన ఎందుకు పసిగట్టలేకపోతున్నారనేది ప్రశ్న.
సినీ గ్లామర్ లేకపోతే పవన్‌కు ప్రజాదరణ ఎలా వస్తుంది? ఏమని పవన్‌ను చూడడానికి జనాలు వస్తారు? తదితర ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. రాజకీయాల్లో ప్రజాభిమానాన్ని చూరగొనడం అంటే …సినిమాల్లో రెండు డైలాగ్‌లు చెప్పి అభిమానుల చప్పట్లు పొందేంత సులువు కాదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే తప్ప, రాజకీయాల్లో నెగ్గుకు రాలేరు.
ఏపీలో చాలా మంది రాజకీయ నాయకులున్నా… అప్పుడప్పుడు జనంలోకి వచ్చే తనకే అభిమానుల తాకిడి ఎందుకో ఒక్కసారి పవన్ ఆలోచించుకోవాలి. కేవలం హీరోగా అబిమానించే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అంతే తప్ప రాజకీయంగా గత పదేళ్లలో పవన్ సాధించింది శూన్యం.
సినీ నేపథ్యానికి కుల బలం తోడు లేకపోయి వుంటే… ఇలా అమావాస్య, పౌర్ణానికి ఒకసారి జనంలోకి వచ్చి రాజకీయాలు చేస్తే జనం పట్టించుకునే పరిస్థితి ఉండదు. తన బలమే హీరో కావడమే అనేది మరిచిపోయి, అదే రాజకీయ అడ్డంకిగా మారిందని పవన్ చెప్పడం ఆయన అజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. టాలీవుడ్ హీరో కాకపోయి వుంటే… ఏపీలో పవన్‌ను పట్టించుకునే దిక్కు వుండదనేది వాస్తవమని నెటిజన్లు అంటున్నారు.