పచ్చమీడియా కొత్త ఎజెండా మొదలెట్టింది?

శాసనవ్యవస్థ ఎక్కువా? న్యాయవ్యవస్థ ఎక్కువా? ఒకపట్టాన సమాధానం తేలని అనేకానేక చిక్కు ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి. ఎవరిని అడిగినా సరే.. రెండూ సమానమైన అధికారాలున్న వ్యవస్థలని, ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని అంటారు. రెండూ స్వతంత్ర…

శాసనవ్యవస్థ ఎక్కువా? న్యాయవ్యవస్థ ఎక్కువా? ఒకపట్టాన సమాధానం తేలని అనేకానేక చిక్కు ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి. ఎవరిని అడిగినా సరే.. రెండూ సమానమైన అధికారాలున్న వ్యవస్థలని, ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని అంటారు. రెండూ స్వతంత్ర వ్యవస్థలని కూడా పేర్కొంటారు. 

అన్నింటినీ మించి రాజ్యాంగం అత్యున్నతమైనదని.. వ్యవస్థ ఏదైనా సరే.. రాజ్యాంగానికి భిన్నంగా ఏమీ చేయజాలదని అంటారు. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించిన మీమాంస ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న రూపంలో తెలుగు ప్రజల ఎదుట నిల్చుంది. శాసనవ్యవస్థ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత.. న్యాయవ్యవస్థ అందులో వేలు పెట్టడం, ఇలాంటి అధికారమే శాసనవ్యవస్థకు లేదని అనడం నిజంగా చర్చనీయాంశమే. 

నిజమే ఇదంతా అమరావతి చుట్టూ జరుగుతున్న వ్యవహారమే. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అధికారమే శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొన్న పర్యవసానంగా చర్చ ఇప్పుడు చాలా జరుగుతోంది. దాని మీద అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. హైకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు. దరిమిలా.. రెండు వ్యవస్థల మధ్య చిన్న సంఘర్షణ వాతావరణం ఏర్పడినట్లయింది.

సరిగ్గా ఇలాంటి అదను కోసం కాచుకుని ఉండే పచ్చమీడియా ఇప్పుడు రెచ్చిపోతోంది. జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను ధిక్కరించినట్లుగా వ్యతిరేకించినట్లుగా ప్రజల్లోకి విషప్రచారాన్ని తీసుకువెళ్లే కొత్త ఎజెండాను వారు భుజానికెత్తుకున్నారు. న్యాయనిపుణుల విశ్లేషణ పేరుతో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వారు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇందులో నిజానిజాల సంగతి ఎవ్వరికీ అక్కర్లేదు. జగన్ కు వ్యతిరేకంగా బురద చల్లే ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే వారికి కావాల్సింది. 

హైకోర్టు తీర్పు సబబు కాదని అనిపిస్తే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. అనేది ఈ పచ్చమీడియా ఇలాంటి కథనాల ముసుగులో లేవనెత్తుతున్న ప్రశ్న. సుప్రీం కోర్టుకు వెళ్లకపోవడాన్ని కూడా తప్పుపట్టి.. అందుకు వక్ర ఉద్దేశ్యాలతో ఏదో ఒకటి ఆపాదించి చేసే ప్రయత్నంగానే ఇది కనిపిస్తోంది. జగన్ ఓ సంగతి చాలా స్పష్టంగా చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ అనే బిల్లునే ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 

ఇక దాని మీద హైకోర్టు ఇంకో తీర్పు చెప్పే అవసరం ఏముందనేది దాని సారాంశం. అసలంటూ లేని బిల్లు మీద ఒక తీర్పు వస్తే.. ఆ తీర్పు మీద మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లడం కామెడీ కాక ఇంకేం అవుతుంది. మూడు రాజధానులకు తాను కట్టుబడి ఉన్నానని విస్పష్టంగా చెప్పిన జగన్, మరింత రాజ్యాంగబద్ధతతో లోపరహితంగా కొత్త బిల్లు పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. అప్పటిదాకా ఆగాలని అనుకుంటారు గానీ.. తీర్పు మీద సుప్రీం కోర్టుకు ఎందుకు వెళతారు. కొత్త బిల్లు తెచ్చి, కొత్తగా దానిని చట్టంగా మార్చిన తర్వాత.. అప్పటికి కూడా హైకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చినట్లయితే దాని మీద సుప్రీం కు వెళ్లడంలో అర్థం ఉంటుంది. 

ఇలాంటి ప్రాక్టికల్ నిజానిజాలు మంచిచెడులేవీ పట్టించుకోకుండా.. కేవలం జగన్ మీద బురద చల్లడం, మైండ్ గేమ్ ద్వారా జగన్ ను ఆత్మరక్షణలో పడేయడమే లక్ష్యంగా.. పచ్చమీడియా ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నట్లు కనిపిస్తోంది.