ముప్పుతిప్పలు పెట్టాడు.. 30 నిమిషాల్లో దొరికాడు

ఎంత పెద్ద దొంగ అయినా ఎక్కడో ఓ చోట చిన్న తప్పు చేస్తాడు. ఆ క్షణం అడ్డంగా దొరికిపోతాడు. హైదరాబాద్ కు చెందిన ఓ దొంగ కూడా ఇలానే దొరికిపోయాడు. ఐదేళ్లుగా మూడు కమిషనరేట్ల…

ఎంత పెద్ద దొంగ అయినా ఎక్కడో ఓ చోట చిన్న తప్పు చేస్తాడు. ఆ క్షణం అడ్డంగా దొరికిపోతాడు. హైదరాబాద్ కు చెందిన ఓ దొంగ కూడా ఇలానే దొరికిపోయాడు. ఐదేళ్లుగా మూడు కమిషనరేట్ల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఈ చోరాగ్రేసుడు, 30 నిమిషాల్లో దొరికిపోయాడు. 

సయ్యద్ సాహిల్.. చాంద్రాగయణగుట్టకు చెందిన గజదొంగ ఇతడు. తాళం వేసిన ఇల్లు ఇతడి కంట పడిందంటే గుల్ల అయిపోవాల్సిందే. సింపుల్ గా ఓ ఐరన్ రాడ్, ఓ స్క్రూ డ్రైవర్ తో పని కానిచ్చేయడం ఇతడి స్టయిల్. ఇతడి దొంగతనం కూడా విలక్షణంగా ఉంటుంది. పొద్దున్నే బైక్ పై వీధులన్నీ రౌండ్స్ కొడతాడు. అలా రెక్కీ నిర్వహించి ఓ ఇల్లు సెలక్ట్ చేసుకుంటాడు. చీకటి పడిన వెంటనే తాళం పగలగొట్టి దోచుకుంటాడు. పైగా, ఈ దొంగతనాలన్నీ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల్లోపే ముగిస్తాడు.

2015లో తొలిసారి ఇతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత పలుమార్లు దొరికినప్పటికీ చిన్న చిన్న శిక్షలతో తప్పించుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా పోలీసుల కళ్లుగప్పి తిరగడం మొదలుపెట్టాడు. ఇతడిపై హైదరాబాద్ కమిషనరేట్ పరిథిలో 33, సైబరాబాద్ లో 8, రాచకొండ కమిషనరేట్ లో 9 కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాంటెండ్ గజదొంగగా ఇతడ్ని పోలీసులు ప్రతి రోజూ వెదుకుతూనే ఉన్నారు.

అలా సింపుల్ గా దొరికిపోయాడు..

ఇలా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న సాహిల్, ఎప్పట్లానే మరో చోరీకి పాల్పడ్డాడు. జిల్లెలగూడలోని ఓ ఇంటిని పగలగొట్టి బంగారు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. దొంగతనం జరిగిన స్టయిల్ చూసి, అది సాహిల్ అని ఫిక్స్ అయ్యారు పోలీసులు. ఇక్కడే సాహిల్ ఓ చిన్న పొరపాటు చేశాడు. దొంగిలించిన సెల్ ఫోన్ ను, తన బామ్మర్దికి బహుమతిగా ఇచ్చాడు.

బహుమతిగా అందుకున్న ఫోన్ ను అపురూపంగా భావించిన సాహిల్ బామ్మర్ది, దాన్ని వాడడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే సెల్ ఫోన్ ఆన్ అయిందో, దాన్ని ఈజీగా ట్రాక్ చేశాడు పోలీసులు. ఆ వెంటనే బాలాపూర్ క్రాస్ రోడ్స్ కు వెళ్లడం, అతడి ద్వారా సాహిల్ ను పట్టుకోవడం చిటికెలో జరిగిపోయాయి. సాహిల్ నుంచి ఏకంగా కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.