జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పంజాబ్‌లో ఆప్ పాగా వేసిన తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కేజ్రీవాల్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేసేందుకు కీలక అడుగులు వేస్తున్నారు.
ఏపీలో బలమైన ఓటు బ్యాంక్‌పై ఆయన కన్నేశారు. ఇందులో భాగంగా కాపు నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారిని పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారని తెలిసింది. సదరు నాయకుడికి క్లీన్ ఇమేజ్ ఉంది. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన, తమిళనాడులో కీలక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో కాపులు అ్యంత బలీయమైన సామాజిక వర్గం అయినప్పటికీ రాజ్యాధికారానికి మాత్రం నోచుకోవడం లేదు. ఇది పెద్ద వెలతిగా ఆ సామాజికవర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశించి పవన్‌కల్యాణ్‌ను ఆదరిస్తే, ఆయన మాత్రం మరొకరిని ముఖ్యమంత్రి చేయాలని భావిస్తుండడంతో కాపులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాలను బట్టి కాపులను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు రాయలసీమలో కాపులను బలిజలంటారు. అలాగే ఒక్కో ప్రాంతంలో తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు అని పిలుస్తుంటారు. అందరినీ కలుపుకుంటే దాదాపు 32% ఓటు బ్యాంక్ వారి సొంతం. ప్రస్తుతం ఏపీని రొటేషన్ పద్ధతిలో పాలిస్తున్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు 5 శాతానికి మించి లేదు. అయినప్పటికీ అందరినీ కలుపుకుని అధికారంలో మాత్రం వారే ఉంటున్నారు.
తమకంటూ బలమైన నాయకుడు లేకపోవడం వల్లే అధికారానికి దూరంగా ఉన్నామనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. త్వరలో కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన నాయకులతో చర్చించే అవకాశాలున్నాయి. ఆప్ సిద్ధాంతం, అలాగే కాపు ఓటు బ్యాంక్ కలిస్తే రాజకీయంగా అద్భుతాలు సృష్టించవచ్చని అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పవన్‌కల్యాణ్‌కు భారీ షాక్ తగిలే అవకాశాలే కనిపిస్తున్నాయి.