ఆర్ఆర్ఆర్ ప్రచారంలో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్. తన భార్య ప్రణతి పుట్టినరోజు అయిపోయిన మరుక్షణం, అర్థరాత్రి 12 కొట్టగానే చరణ్ పుట్టినరోజు వేడుకల్లో జాయిన్ అయిపోతానని వెల్లడించాడు. చరణ్ ప్రతి పుట్టినరోజుకు సరిగ్గా రాత్రి 12 గంటలకు తనను కారు ఎక్కించుకొని పార్టీకి తీసుకెళ్తాడని కూడా చెప్పుకొచ్చాడు. మరోసారి ఆ సందర్భం రానే వచ్చింది.
ఓవైపు ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి వచ్చిన ఆనందం, మరోవైపు చరణ్ పుట్టినరోజు. దీంతో ఎన్టీఆర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఆర్ఆర్ఆర్ ఆనందాన్ని, చరణ్ బర్త్ డేను ఒకేసారి సెలబ్రేట్ చేసుకునేలా తన ఇంట్లో రాత్రి పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి రాజమౌళి, కార్తికేయ, అఖిల్ అక్కినేని లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఎన్టీఆర్ ఇంట్లోనే చరణ్ తన బర్త్ డే కేక్ కట్ చేశాడు. సరిగ్గా రాత్రి 12 గంటలకు, ఓవైపు ప్రణతితో (ఆమె పుట్టినరోజు 26న), మరోవైపు చరణ్ తో కేక్స్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ హంగామా మొత్తాన్ని తన కెమెరాలో బంధించింది చరణ్ భార్య ఉపాసన. ఇటు భర్త చరణ్ కు, అటు ఎన్టీఆర్ భార్య ప్రణతికి ఒకేసారి శుభాకాంక్షలు చెబుతూ ఓ మంచి ఫొటోను పోస్ట్ చేసింది.
మరోవైపు చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఓ మంచి మూమెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం వింతగా ఉందంటూనే.. చరణ్ చిన్నప్పటి ఫొటోను, తాజాగా ఆచార్య వర్కింగ్ స్టిల్ ను అభిమానులతో పంచుకున్నారు.