చంద్రబాబు జమానాలో హంగుల ప్రపంచం కనిపించేది. ఎల్లో పత్రికల్లో అభివృద్ధి తాటికాయంత అక్షరాలతో మెరిసేది. ఇక సమీక్షలు, డాష్ బోర్డులు, క్రైసిస్ మేనేజ్ మెంట్ అంటూ చంద్రబాబు చేసిన హంగామాకు అంతే లేదు.
ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కొత్తలో టెంట్ కింద ప్రెస్ మీట్లు పెట్టిన హంగామా నుంచి భ్రమరావతి గ్రాఫిక్స్ ను కళ్లకుకట్టిన హడావుడి వరకు చంద్రబాబు పండించిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. ఇక పసుపు-కుంకుమ, ప్రత్యేకహోదా విషయంలో బాబు మాటకారితనానికి ప్రత్యక్ష సాక్ష్యులుగా కోట్లాది మంది ప్రజలు ఉండనే ఉన్నారు.
ఇప్పుడిదంతా ఎందుకు? ఎందుకుంటే.. ఏపీ ప్రజలు మరోసారి అలాంటి హంగామానే కోరుకుంటున్నారేమో అనిపిస్తోంది. జగన్ నుంచి బాబు తరహా హడావుడిని కొంతమంది ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పనే లక్ష్యం, సంక్షేమమే ధ్యేయం. ఒక దశలో మీడియాకు కూడా దూరం, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దూరం దూరం. కరోనా లాంటి సంక్షోభంలో కూడా తొణకకుండా తనపని తాను చేసుకుపోయారు జగన్. దేశానికే ఆదర్శంగా నిలిచారు. కానీ ఏపీలో ఓ వర్గం మాత్రం జగన్ హడావుడి చేయాలని కోరుకుంటోంది.
కేవలం పని చేస్తే కుదరదని, ఈ కాలం కాస్త హంగామా కూడా కనిపించాలని చెబుతోంది. ఈ హైటెక్ యుగంలో అలా ఉన్నప్పుడు మాత్రమే జనాల్ని ఆకర్షించగలమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యూత్ కు దగ్గరవ్వాలంటే కాస్త హడావుడి కనిపించాలంటూ జగన్ పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.
పవన్ చేస్తోంది అదే..
ప్రస్తుతం పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో ఇలా హడావిడి చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పంచ్ డైలాగులు విసరడం, ఎన్నికలు రేపే అన్నంతగా బిల్డప్ ఇవ్వడం, పట్టుమని పార్టీలో 10మంది కీలక నేతలు లేకపోయినా.. కమిటీలు, పోస్టింగ్ లు, సభ్యత్వాలు, ఇన్సూరెన్స్ లు అంటూ హడావిడి చేయడం.. ఇలా ఎక్కడా తగ్గట్లేదు పవన్ కల్యాణ్.
తిట్టడం, తిట్టించుకోవడం, ఓవైపు సినిమాలు చేసుకుంటూనే, ఈవైపు జనాల్లో ఉన్నాను అనిపించుకోడానికి పవన్ పడుతున్న తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అది ప్రజల కోసం కాదు, ప్యాకేజీ కోసమేనని కొందరు విమర్శిస్తున్నప్పటికీ.. ఆయన పగడ్బందీగా తన ఇమేజ్ ని పెంచుకోడానికి చేస్తున్న కృషిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఇంతా చేసి రేపు పవన్ కల్యాణ్ కనీసం ఒక్క స్థానంలో అయినా గెలుస్తారా అంటే అదీ లేదు. అయినా సీఎం సీఎం, జనసేనాని సీఎం.. ఈ స్లోగన్లకి మాత్రం కొదవ లేదు.
ఎన్నికల టైమ్ కు చంద్రబాబు చేయబోయేది ఇదే..
ప్రచార కార్యక్రమాలకు మారుపేరు చంద్రబాబు. చేతిలో మీడియా ఉంది కాబట్టి, తాను ఏం చేసినా, ఎంత అతి చేసినా ఎడిట్ చేయకుండా ఇవ్వగలరు కాబట్టి బాబు ఆడింది ఆట, పాడింది పాట. అసెంబ్లీలో అలగడం, బయటకొచ్చి ఏడవడం, ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రెస్ మీట్లు పెట్టించడం.. ఇలాంటి కతలన్నీ చంద్రబాబుకి అలవాటే.
తాను లేకపోయినా, తన పార్టీవారు నలుగురు పక్కకి వెళ్లిపోయినా మిగతా 18మంది ఎమ్మెల్యేలు, కలసి వచ్చే ఎమ్మెల్సీలతో ప్రతి రోజూ అసెంబ్లీ వద్ద ఎంత హంగామా జరిగిందో చూశాం. ఇలాంటి జిమ్మిక్కులు, గిమ్మిక్కుల్లో బాబుని మించినవారు ఎవరూ లేరు. అవసరం లేకపోయినా తీర్థ యాత్రల్లాగా, శవయాత్రల్లో పాల్గొనడం ఈమధ్య పెదబాబు, చినబాబు బాగా అలవాటు చేసుకున్నారు.
ఎక్కడ ఎవరు, ఏ కారణంతో చనిపోయినా శవరాజకీయం చేయడం, దానిపై పచ్చ కండువా కప్పేయడం చూస్తుంటే ప్రచార వ్యామోహంలో, ప్రతీకార రాజకీయాల కోసం బాబు ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల టైమ్ లో ఈ దరిద్రం మరింతగా పెరిగిపోతుంది.
జగన్ కు అవసరం లేనిది కూడా ఇదే…
ఇక జగన్ కి ఈ అతి అవసరమా అంటే, లేదు అనే చెప్పాలి. కానీ లేకపోతే జనంలో అసలు జగన్ పనిచేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. బటన్ నొక్కగానే బ్యాంక్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్ అవుతోంది కానీ, జగన్ కూడా జనంలోకి రావాలని, రచ్చబండ లాంటి కార్యక్రమాలతో రచ్చ రచ్చ చేయాలని ఓ వర్గం కోరుకుంటోంది. టీడీపీని కౌంటర్ చేయాలన్నా, పవన్ ఓవర్ యాక్షన్ ని తగ్గించాలన్నా.. ప్రచారం ముఖ్యం అంటున్నారు.
కానీ జగన్ ససేమిరా అంటున్నారు. అలాంటి జిమ్మిక్కులేవీ తనకు, తన పార్టీకి అవసరం లేదంటున్నారు. కాగల కార్యం కార్యకర్తలే తీరుస్తారంటున్నారు. ఎమ్మెల్యేలంతా ఇకపై నిత్యం జనంలోనే ఉండాలని, జనం బాగోగుల్ని పట్టించుకోవాలని, వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుని పరిష్కరించాలంటున్నారు. బహుశా జగన్ నుంచి రాబోయే రెండేళ్లలో కూడా అలాంటి హంగామాని ఎవరూ చూడలేరేమో.