ఆప్త మిత్రుడు, మాజీ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోరెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? …. ఇప్పుడీ చర్చ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కోరిక మేరకే గౌతమ్ రాజకీయాల్లో వెళ్లారు. వివాద రహితుడిగా పేరొందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కర్నీ కలచివేసింది.
మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గౌతమ్‌రెడ్డి కుటుంబం విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సానుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఆత్మకూరులో కాంగ్రెస్, బీజేపీ పోటీకి ముందుకొస్తే తప్ప అక్కడ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
అయితే మేకపాటి కుటుంబంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. వైఎస్ జగన్ ఆలోచనలు ఏంటనేది కూడా ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం నెల్లూరులో జరిగే గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొననుండడం చర్చనీయాంశమైంది.
ఈ సభలో గౌతమ్ కుటుంబానికి ఏ విధమైన న్యాయం చేయాలని సీఎం భావిస్తున్నారో వెల్లడించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరనున్న పరిస్థితుల్లో గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులెవ రికైనా అవకాశం ఇస్తున్నట్టు జగన్ ప్రకటిస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో జగన్ కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.