ఇకపై..సినిమాలే సినిమాలు

2023 తొలిసగంలో సినిమాలు బోలెడు వచ్చాయి..వస్తున్నాయి. అయితే ప్లానింగ్ అంత గొప్పగా లేదు. హిట్ లు కూడా సక్రమంగా లేవు. కానీ 2024 అలా వుండేలా లేదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 2023…

2023 తొలిసగంలో సినిమాలు బోలెడు వచ్చాయి..వస్తున్నాయి. అయితే ప్లానింగ్ అంత గొప్పగా లేదు. హిట్ లు కూడా సక్రమంగా లేవు. కానీ 2024 అలా వుండేలా లేదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 2023 ఆగస్టు నుంచి సినిమాల తాకిడి చాలా బలంగా వుండేలా కనిపిస్తోంది. లెక్కలు మిక్కిలిగా సినిమాలు సెట్ మీద వున్నాయి. చకచకా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నవీ వున్నాయి. 

విడుదల డేట్‌లు ప్రకటించేసి, ఆ దిశగా పరుగులు పెడుతున్నవీ వున్నాయి. చాలా మంది వరకు ఒక్కో హీరో చేతిలో రెండు నుంచి మూడు సినిమాలు వున్నాయి. సమాంతరంగా షూట్ లు చేస్తున్నారు. దీనివల్ల ఈ ఏడాది ఆగస్ట్ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు లోపు చాలా మంది హీరోల నుంచి రెండు లేదా మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేలా వుంది పరిస్థితి.

పవన్ లాంటి పెద్ద హీరోల సినిమాలే రెండు నుంచి మూడు రాబోతున్నాయి. బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది హీరోల సినిమాలు ఈ ఆగస్టు నుంచి వచ్చే ఆగస్టు లోగా రెండు నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇక ఆ తరువాత రేంజ్ హీరోల సంగతి అయితే చెప్పనక్కరలేదు.

మరోపక్కన తమిళ, మలయాళ హీరోల సినిమాలు కూడా తెలుగులో రెడీ కాబోతున్నాయి. చిన్న పెద్ద సినిమాలు కలిసి నూరు నూటయాభై రావడం వేరు. ఈ ఆగస్టు నుంచి వచ్చే ఆగస్టులోగా చిన్న సినిమాల కన్నా మిడ్ రేంజ్ నుంచి టాప్ రేంజ్ సినిమాలే ఎక్కువగా వుండబోతున్నాయి. ఏ ఒక్క నటుడు ఖాళీ లేరు. అన్ని షూటింగ్ లు ఒకేసారి జరుగుతుండడంతో, కాల్ షీట్ల అడ్జస్ట్ మెంట్ల కూడా కష్టం అవుతోందని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

దీనివల్ల ఏ వారం కూడా పెద్ద అయినా, చిన్నది అయినా సినిమాలు సోలోగా వచ్చే పరిస్థితి లేదు. పోటీలు కాస్త గట్టిగానే వుంటాయి.