మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం

తెల్లారితే నిశ్చితార్థం. రెండు మనసులు ఏకమయ్యే రోజు. రెండు కుటుంబాలు కలిసే పర్వదినం. అంతలోనే ఘోర ప్రమాదం. సరదాగా ఉండాల్సిన ఆ కుటుంబాల్లో పెను విషాధం. నిశ్చితార్థం కోసం బయల్దేరిన బస్సు, లోయలో పడింది.…

తెల్లారితే నిశ్చితార్థం. రెండు మనసులు ఏకమయ్యే రోజు. రెండు కుటుంబాలు కలిసే పర్వదినం. అంతలోనే ఘోర ప్రమాదం. సరదాగా ఉండాల్సిన ఆ కుటుంబాల్లో పెను విషాధం. నిశ్చితార్థం కోసం బయల్దేరిన బస్సు, లోయలో పడింది. నిండు ప్రాణాల్ని చిదిమేసింది. చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ ఘోరం.

అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన వేణుకు, చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. అన్నీ సెట్ అయ్యాయి. నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి వేణు కుటుంబ సభ్యులంతా తిరుచానూరు బయల్దేరారు. నిన్న మధ్యాహ్నం 50 మందితో బయల్దేరిన బస్సు.. రాత్రి 8 గంటల సమయంలో ఓ ధాబా వద్ద ఆగింది. అంతా భోజనాలు చేశారు. ఆ తర్వాతే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.

కర్నాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న ఆ బస్సు భాకరాపేట వచ్చేసరికి అదుపు తప్పింది. అది ఘాట్ రోడ్డు కావడంతో 60 అడుగుల లోతులోకి బస్సు దూసుకుపోతోంది. అసలే చీకటి, ఏం జరిగిందో తెలిసే లోపే ప్రమాదం జరిగిపోయింది. కళ్లముందే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో పెళ్లికొడుకు తాత, తండ్రి, బాబాయ్, పిన్ని ఉన్నారు.

ఈ ప్రమాదంలో పెళ్లికొడుకుతో పాటు 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లందర్నీ హుటాహుటిన తిరుపతిలోని పలు ఆస్పత్రుల్లో జాయిన్ చేశారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు.

ప్రమాదంలో గాయపడిన వాళ్లను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పరామర్శించారు. వాళ్లకు అందుతున్న వైద్య సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి తక్షణ సాయం కింద 50వేల రూపాయల పరిహారాన్ని అందించారు.