ఓటీఎస్ డబ్బులు కట్టొద్దు, నేను అధికారంలోకి వచ్చాక అన్నీ మాఫీ చేస్తా, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తానంటూ డబ్బా కొట్టారు చంద్రబాబు. కట్ చేస్తే ఓటీఎస్ వసూళ్లలో నెంబర్ వన్ స్థానం చిత్తూరుకే దక్కింది. మరి బాబు మాట సొంత జిల్లావారు కూడా విననట్టే కదా.
కుప్పం సీటు కూడా కదిలిపోయే స్టేజ్ కి వచ్చాక ఇక చంద్రబాబు మాట చిత్తూరు జిల్లావాళ్లయినా ఎందుకు వింటారు. అందుకే బాబు గాలిమాటలు వినకుండా జగన్ కి జై కొట్టారు. ఓటీఎస్ కి డబ్బులు కట్టారు.
వన్ టైమ్ సెటిల్మెంట్..
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఓటీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఖజానాలో డబ్బుల్లేవు, అందుకే ఇలాంటి పథకాలు తెచ్చారని ఎద్దేవా చేసింది ప్రతిపక్షం.
డబ్బులు కట్టినా చెల్లుబాటు కావని, కనీసం ఆ రిజిస్ట్రేషన్ పత్రాలతో బ్యాంకు లోన్లు కూడా రావని ఎద్దేవా చేసింది. కానీ బ్యాంక్ లోన్లే కాదు, రీసేల్ కి కూడా బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ పత్రాలు పనికొస్తున్నాయి. దీంతో ఓటీఎస్ పై ప్రజలు ఆసక్తి చూపించారు.
ఏపీలో దాదాపు 9.86 లక్షలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 339 కోట్ల రూపాయలు వసూలైంది.
చిత్తూరుకి నెంబర్ 1 ప్లేస్..
విచిత్రం ఏంటంటే.. ఓటీఎస్ వసూళ్లలో చిత్తూరు జిల్లా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. చిత్తూరు జిల్లా వాసులు వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం 61 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు.
ఆ తర్వాతి స్థానం తూర్పుగోదావరి జిల్లాకు దక్కింది. తూర్పు గోదావరి వాసులు 41 కోట్ల రూపాయలు చెల్లించగా, మూడో స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లా వాసులు 32కోట్లు చెల్లించి ఓటీఎస్ పథకం ద్వారా లబ్ధి పొందారు.
బాబు మాటలపై నమ్మకం పోయిందా..?
మీరు డబ్బు కట్టొద్దు.. మేం అధికారంలోకి వస్తే ఉచితంగానే రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పినా జనం వినలేదు. ఓ దశలో ఓటీఎస్ కి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టింది ప్రతిపక్షం. అంతే కాదు, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టింది. కానీ ఇవేవీ క్షేత్ర స్థాయిలో నిలబడలేదు.
నామమాత్రపు రుసుము చెల్లించి సంపూర్ణ గృహ హక్కు పొందారు లబ్ధిదారులు. ఏళ్లతరబడి ఉన్న సమస్యను చిటికెలో పరిష్కరించుకున్నారు.
బాబు మాటకి మోసపోకుండా చిత్తూరు జిల్లా వాసులు పూర్తిగా చైతన్యం కావడం ఇక్కడ మరో విశేషం. ఇదే స్ఫూర్తి 2024 ఎన్నికల్లో కూడా చూపిస్తే.. బాబు సీటు కూడా గల్లంతవడం ఖాయం.