ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఏమనాలి? డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనాలా? కొత్త సంప్రదాయాలకు తెరతీసిన మొనగాడు అనాలా? వ్యవస్థలను ఢీ కొడుతున్న కొండ అనుకోవాలా? మాట తప్పడు…మడమ తిప్పడు అనే బిరుదును సార్ధకం చేసుకోవడానికి పాట్లు పడుతున్నాడని అనుకోవాలా? ఇలా జగన్ వైఖరిపై ఎంతైనా చెప్పుకోవచ్చు. చరిత్రలో జగన్ కు తప్పనిసరిగా ఒక పేజీ ఉండటం ఖాయం.
సాధారణంగా కోర్టు తీర్పుల గురించి. న్యాయమూర్తుల గురించి, వారి వైఖరుల గురించి పబ్లిగ్గా మాట్లాడకూడదనే అభిప్రాయం ఒకటుంది. కానీ జగన్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కాబట్టి అమరావతి మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అసెంబ్లీలోనే చర్చ జరిపారు. అసెంబ్లీయే అత్యున్నతమైందని, అది చెప్పిందే వేదమని, చేసిందే చట్టమని తేల్చిపారేశారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు సాధారణంగా. జగన్ వైఖరి అలాగే ఉంది.
జగన్ హైకోర్టు తీర్పును తప్పు పట్టారు అనడం కంటే న్యాయ వ్యవస్థతో ఘర్షణ పడుతున్నారు అనడం సరైంది.
అమరావతి విషయంలో ఆయనకు మరో కొన్ని అవకాశాలు ఉంచుకొని కూడా తాను చేసిందే కరెక్టు అని, ప్రశ్నించడానికి కోర్టు ఎవరని అంటున్నాడంటే నిజంగా ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అనే చెప్పుకోవాలి. అంతిమంగా ఈ ఘర్షణ ఎటు దారి తీస్తుందో చెప్పలేం. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ చాలా అసహనంగా కనిపిస్తున్నారు. ఈ విషయంలో తన పరువు పోయినట్లుగా భావిస్తున్నారు. ధిక్కారమున్ సైతునా అన్నట్లుగా ఉంది ఆయన వైఖరి. వాస్తవానికి అమరావతిపై హైకోర్టు తీర్పు ఫైనల్ కాదు. అది శిలా శాసనం కాదు.
అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉండగా.. అలా చేయకుండా అసెంబ్లీలోనే చర్చకు పెట్టారు. తద్వారా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా జడ్డీల తీరును తప్పుబట్టారు. కానీ ఇది మంచి సంప్రదాయం కాదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయం కోరే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయని, మూడు రాజధానులతోనే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని వాదించే అవకాశమూ ఉంది.
అమరావతిలో అక్రమాలు జరిగాయని, కాబట్టి రాజధాని మార్చకతప్పదని ఆధారాలతో సహా నిరూపించేందుకు అవకాశం ఉంది. కానీ ఇవేవీ చేయకుండా అమరావతి రాజధాని కొనసాగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీలో తూర్పారబట్టాలని వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్ధల మధ్య కొత్త సంఘర్షణకు దారి తీయబోతోంది. అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. వాటిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే వెనక్కి తీసుకుంది. తిరిగి ఈ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టి తీరుతామని పదే పదే చెప్పింది. కానీ జరిగింది వేరు.
అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నప్పుడు అదే అసెంబ్లీకి ఉన్న అధికారాన్ని వాడుకుంటూ మూడు రాజధానులపై కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
హైకోర్టు వద్దన్నా అసెంబ్లీకి అధికారం ఉందని భావించినప్పుడు కొత్త బిల్లు ప్రవేశపెట్టడంపై వెనకడుగు వేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ జగన్ సర్కార్ అలా చేయలేదు. కొత్త బిల్లు ప్రవేశపెట్టకుండా, అలాగని హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేవలం అసెంబ్లీలో చర్చ పెట్టి రాజకీయ ఎదురుదాడి చేసింది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం ఇష్టం లేకపోతే ప్రభుత్వం ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
ఇందులో అదే హైకోర్టును రివ్యూ కోరే అవకాశం ఉంది. కాదంటే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అక్కడా కుదరకపోతే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులు సదరు చట్టం రాజ్యాంగ బద్ధమా కాదా అన్నది తేలుస్తాయి.
కానీ ఇవేవీ చేయకుండా అసెంబ్లీ వేదికగా అమరావతి తీర్పు ఇచ్చిన హైకోర్టుపై, జడ్డీలపై విమర్శలు, వారి పరిధిని గుర్తుచేస్తూ వ్యాఖ్యలు, వారి ఎంపికపై కామెంట్స్ చేయడం ద్వారా ప్రభుత్వం మరో ముఖాముఖీ పోరుకు తెర లేపింది. అన్నింటికీ మించి హైకోర్టు తీర్పును అమలు చేయకుండా మూడు రాజధానులపై ముందుకెళ్తామని అసెంబ్లీలో ప్రకటించడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ వ్యవస్థలతో ఘర్షణ పడుతూనే ఉన్నారు. అది హీరోయిజం అని ఆయన అనుకుంటున్నారు. కానీ బయట వస్తున్న చెడ్డ పేరును ఆయన గమనించడం లేదు.