వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మరో ఆయుధం చిక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఏపీ ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) చైర్మన్ కొండూరు అనిల్‌బాబు ఉన్నాడని బాధిత బాలిక తండ్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
తన కుమార్తెను అనిల్ ఆయన గెస్ట్‌హౌస్‌లకు, ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక తండ్రి ఫిర్యాదులో. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో తన కుమార్తె భయపడి ఇంతకాలం ఎవరికీ చెప్పలేదని ఆయన ఎస్సీ కమిషన్‌కు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా వుండగా తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఎవరో కుట్రపన్ని బాలిక తండ్రితో ఫిర్యాదు చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండూరు అనిల్‌బాబు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. నాలుగు నెలల తర్వాత ఈ కేసులో తాజాగా తన పేరు తెరపైకి తేవడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కానీ ఈ కేసులో కొండూరు అనిల్‌బాబు పేరు ఉండడం అధికార పార్టీకి తలనొప్పే. పైగా అతను ఏపీ ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) చైర్మన్ కావడం గమనార్హం.
ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంపై వెంటనే స్పందించారు. దీనిపై విచారణ చేపట్టాలని గుంటూరు పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల విజయవాడలో టీడీపీ నేత అసభ్య ప్రవర్తనతో ఒక బాలిక ఆత్మహత్యకు పాల్పడడంపై తీవ్ర దుమారం చెలరేగింది. వెంటనే అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ టీడీపీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు అనిల్‌బాబు విషయంలో వైసీపీ వ్యవహరించే తీరును బట్టి పార్టీకి ఏ విధంగా నష్టం వాటిల్లుతుందో చెప్పొచ్చు. అనిల్‌బాబుపై ఆరోపణలు నిజం కాదని తేలే వరకూ అధికార పార్టీ పక్కన పెడుతుందా లేక ప్రతిపక్షాల ఆరోపణలు మామూలే అని కొనసాగిస్తుందా? అనే చర్చకు తెరలేచింది. కరోనా బారిన పడి కోలుకున్న బాలిక భవిష్యత్‌లో మరోసారి మహమ్మారిబారిన పడకుండా నాటు వైద్యం చేయిస్తానని నమ్మబలికి వ్యభిచార ఊబిలోకి దింపడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. అలాంటి బాలికను లైంగికంగా దోచుకున్న వాళ్లెవరైనా శిక్షార్హులు.
అనిల్‌బాబు విషయంలో అధికార పార్టీ నిజాలు నిగ్గుతేల్చి, దోషి అని తేలితే కఠినంగా వ్యవహరించాల్సి వుంది. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.