పుకార్లే నిజమయ్యాయి. ఊహాగానాలు వాస్తవరూపం దాల్చాయి. నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఒకటి కాబోతున్నారు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనే రూమర్లు చాన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ జంట వాటిని ఖండించలేదు, అలా అని సమర్థించనూ లేదు.
అలా కొన్నేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుంటున్న ఈ కపుల్, త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారు. తాజాగా వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ ముగిసింది. నిక్కీ గల్రానీని తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు ఆది. 2 రోజుల కిందట వీళ్ల నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోల్ని కూడా షేర్ చేశాడు
“కొన్నేళ్లుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇరు కుటుంబ సభ్యుల మధ్య మా నిశ్చితార్థం జరిగింది. ఇద్దరం కలిసి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.”
ఇలా పెద్దల అంగీకారంతో ఈ ప్రేమికులిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమ వ్యవహారం చాన్నాళ్లు నడిచింది. లాక్ డౌన్ టైమ్ లో అది మరింత బలపడింది. ఆమధ్య ఆది ఇంట్లో జరిగిన ఓ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కు నిక్కీ హాజరైంది. అప్పుడే ఇద్దరి మధ్య బంధం గురించి బయటపడింది. అంతకంటే ముందు చెన్నైలోని పలు రెస్టారెంట్లలో వీళ్లిద్దరూ కలిసి కనిపించారు.
మరకతమణి సినిమాలో ఆది-నిక్కీ కలిసి నటించారు. అప్పట్లో జరిగిన ఆ సినిమా ఫంక్షన్ కు నాని హాజరయ్యాడు. ఆది-నిక్కీ జంట బాగుందని.. ఇద్దరూ రియల్ లైఫ్ లో కూడా ఒకటైతే బాగుంటుందంటూ అప్పట్లో సభా వేదికపైనే కామెంట్ చేశాడు నాని. అదే ఇప్పుడు నిజమైంది. బహుశా.. అప్పటికే ఇద్దరూ లవ్ లో ఉన్నారేమో.