ఒకవైపు హిందీ బెల్ట్, ఉత్తరాదిన కశ్మీరీ ఫైల్స్ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ ఉంది. ఈ సినిమా వసూళ్లు రెండు వందల కోట్ల రూపాయల స్థాయిని చేరినట్టుగా బాలీవుడ్ బాక్సాఫీస్ పండిట్లు చెబుతున్నారు. అయినా ఈ సినిమా వసూళ్ల పరంపర కొనసాగుతూ ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే..ఈ సినిమా కలెక్షన్ల ప్రభావం, ఈ సినిమాకు జనాలు బారులు తీరుతుండటం వల్ల.. ఇదే సమయంలో విడుదలైన హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' డిజాస్టర్ దిశగా సాగుతోందని సమాచారం. కశ్మీరీ ఫైల్స్ ను అసలే మాత్రం పోటీదారుగా పరిగణించి ఉండరు బచ్చన్ పాండే మేకర్లు. అయితే ఆ సినిమా వసూళ్ల ధాటిని చూసి అయినా ఈ సినిమాను వాయిదా వేయాల్సింది.
అయినా విడుదల చేశారు, దీనికి తోడు.. బచ్చన్ పాండే పై నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. తమిళ సినిమా జిగర్తాండా కు కొన్ని మార్పులు చేసి బచ్చన్ పాండేను రూపొందించారు. తెలుగులో ఆకట్టుకున్న ఆ తమిళ రీమేక్ సినిమా, హిందీ వెర్షన్ విషయంలో మాత్రం పెదవి విరుపులు ఎదుర్కొంటోంది. ఇద్దరు హీరోల పాత్రలను ఒకే దానిగా మలిచి.. రెండో హీరో పాత్రను లేడీ క్యారెక్టర్ గా మార్చి హిందీలో గద్దలకొండ గణేష్ ను రూపొందించారు. అయితే ఈ మార్పు చేర్పులు వికటించినట్టుగా ఉన్నాయి.
ఈ సినిమా పై విమర్శకులు విరుచుకుపడ్డారు. అయినప్పటికీ స్టార్ హీరో సినిమా కాబట్టి.. వసూళ్లకు ఢోకా ఉండేది కాదేమో! అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కశ్మీరీ ఫైల్స్ హవా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో.. బచ్చన్ పాండే నలిగిపోయినట్టుగా ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.