నాగిరెడ్డి దంపతుల మరణంతోనే కర్నూరు జిల్లాలో భూమా కుటుంబ రాజకీయాలకు తెరపడిందని అనుకున్నారంతా. కానీ అఖిల ప్రియను మంత్రిని చేసి గత టీడీపీ ప్రభుత్వం కాస్తో కూస్తో ఊపిరి పోసింది. ఇప్పుడు బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుతో కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం పరువు పూర్తిగా మంటగలిసింది. గతంలో అఖిల భర్త భార్గవ్ రామ్ వ్యవహారాలను స్థానికులు చీదరించుకున్నా.. ఇప్పుడీ చీటింగ్ స్టోరీతో ఆ ఫ్యామిలీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది.
మరోవైపు రాజకీయంగా కూడా భూమా కుటుంబానికి గడ్డుకాలం ఎదురవుతోంది. ఓవైపు అఖిల ప్రియ జైలులో ఉండటం, మరోవైపు ఆమె భర్త, తమ్ముడు పరారీలో ఉండటం, అఖిల చెల్లెలు మౌనిక సింపతీ కోసం డ్రామాలాడటం.. ఇలా చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టుగా తయారైంది ఆ కుటుంబం పరిస్థితి. ఇదే సమయంలో కర్నూలులో పాతికేళ్లుగా భూమా కుటుంబానికే దఖలు పడ్డ విజయ డైరీ చైర్మన్ పదవి.. ప్రత్యర్థులకు వెళ్లిపోతుండటం మరో షాకింగ్ న్యూస్.
అవును.. పాతికేళ్లుగా భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి ఏకగ్రీవంగా గెలుస్తూ వస్తున్న విజయ డైరీ చైర్మన్ పదవి ఈసారి వైసీపీకి చెందిన ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని సమాచారం. ఎస్వీ జగన్ ఎవరో కాదు.. అఖిల ప్రియకు మేనమామ, శోభా నాగిరెడ్డికి స్వయానా తమ్ముడు.
నాగిరెడ్డి దంపతుల మరణంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు బాగా ముదిరాయి. ఎస్వీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మకస్తుడిగా కొనసాగుతున్నారు. టీడీపీ ప్రలోభాలకు ఆయన ఏనాడూ లొంగలేదు. ఆ నమ్మకంతోటే.. ఆయనకు విజయ డైరీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని, భూమా కుటుంబానికి చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నారు సీఎం జగన్. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో కూడా ఇదే విషయాన్ని ఎమ్మెల్యేల వద్ద స్పష్టం చేశారట.
విజయ డైరీ టర్నోవర్ ఏడాదికి 140 కోట్ల రూపాయలు. ఈ పాతికేళ్లలో చైర్మన్ పదవి అడ్డు పెట్టుకుని భూమా నారాయణ రెడ్డి బాగానే వెనకేసుకున్నారని, రైతులు, ఉద్యోగులకు రావాల్సిన సొమ్మంతా దిగమింగారని విమర్శలున్నాయి.
తమ కుటుంబానికే చెందిన జగత్ డైరీతో కుమ్మక్కై.. అక్రమాలు కొనసాగిస్తున్నారు. అడ్వాన్స్ ల రూపంలో జగత్ డైరీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులిచ్చారనే ఆరోపణ కూడా ఉంది. కేవలం ఒక్క జగత్ డైరీయే.. విజయా డైరీకి రూ.80లక్షల బకాయి ఉండటం విశేషం.
ఇక భార్య పేరుతో ఉన్న కారుని కంపెనీ కోసం వాడుకుంటూ బిల్లులు పెట్టుకుంటారట నారాయణ రెడ్డి. గతంలో రోజూ 1.30లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించే విజయ డైరీ ఇప్పుడు కేవలం 30వేల లీటర్లు మాత్రమే కొనుగోలు చేసే స్థితికి దిగజార్చడం కూడా ఆయన ఘనతేనని అంటారు. మొత్తమ్మీద భూమా అక్రమాలన్నిటికీ ఇప్పుడు చెక్ పడబోతుందనమాట.
140 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న విజయ డైరీ చైర్మన్ పదవిని మరోసారి నిలబెట్టుకునేందుకు భూమా నారాయణ రెడ్డి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఎస్వీ కుటుంబం కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసకుకుంది.
ఇప్పటికే మూడు డైరెక్టర్ల పోస్టులకు, చైర్మన్ పదవికి నామినేషన్లు స్వీకరించారు. ఈ నేపథ్యంలో విజయ డైరీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పోస్ట్ కూడా భూమా కుటుంబం నుంచి వెళ్లిపోతే.. ఇక కర్నూలులో ఆ కుటుంబ రాజకీయ ప్రయాణం భూస్థాపితం అయినట్టేనని అంటున్నారు.