లోకేశ్ రాజకీయ భవిష్యత్‌కే దిక్కులేదన్నది వాస్తవం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో పేదలకు నివాస స్థలాలు ఇవ్వడంతో మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ చేయరనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పట్టుదలకు పోయి మంగళగిరి బరిలో నిలిచినా లోకేశ్ ఓడిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ జనం భవిష్యత్‌కు తాను గ్యారెంటీ ఇస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది.
టీడీపీ హయాంలో ఏమీ చేయకుండా, మరోసారి అధికారం అప్పగిస్తే అద్భుతాలు సృష్టిస్తామని తండ్రీతనయులు చంద్రబాబు, లోకేశ్ హామీలు గుప్పిస్తున్నారు. పాదయాత్రలో లోకేశ్ ప్రసంగం వింటే… కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతోంది. వీళ్లే కదా ఇంత కాలం అధికారంలో ఉండి, సొంత ప్రయోజనాలకు పవర్‌ను వాడుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అధికారం అప్పగిస్తే ఆకాశంలో చంద్రుడిని తీసుకొచ్చి ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో నమ్మబలుకుతున్నారు.
రాయలసీమలో లోకేశ్ పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతోంది. టీడీపీ ప్రభుత్వం రాగానే ఏటా 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొదటి వంద రోజుల్లోనే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పీజీలకూ ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రవేశపెడుతామన్నారు.
ఇలా అనేక హామీలు గుప్పిస్తూ రాష్ట్ర ప్రజానీకం భవిష్యత్‌కు తనది గ్యారెంటీ అని లోకేశ్ హామీ ఇవ్వడం విశేషం. ఈ దఫా టీడీపీ అధికారంలోకి రాకపోతే, అలాగే లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక యువనాయకుడి భవిష్యత్ అంధకారంలోకి వెళుతుందనేది వాస్తవం.
తన భవిష్యత్‌కే భరోసా లేని లోకేశ్ ఇక రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా ఇస్తారనే చర్చ మొదలైంది. అధికారంలో ఉన్నంత కాలం ప్రజా సమస్యల్ని గాలికి వదిలేయడం వల్లే ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ నిలదీతలకు గురి అవుతున్నారు.