కర్ణాటకలో కొలువుతీరిన సిద్ధరామయ్య సర్కారు ఇక కత్తిదూయడం ప్రారంభించింది. గత బిజెపి సర్కారు తీసుకువచ్చిన చట్టాలు, చేసిన మార్పులను రద్దు చేయడం మీద ఇప్పుడు దృష్టి సారిస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే.. మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేస్తూ సిద్ధరామయ్య కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే బిజెపి సర్కారు పాఠ్యాంశాల్లో చేసిన మార్పులను కూడా రద్దు చేసింది. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ జీవితాన్ని పాఠంగా పెట్టగా, దాన్ని కూడా తొలగించింది. అంతా బాగానే ఉంది, కానీ సిద్ధరామయ్య సర్కారు, బిజెపి చేసిన పనులన్నిటినీ వెనక్కు తిప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నదా లేదా తాము తీసుకుంటున్న నిర్ణయాల్లో ఔచిత్యాన్ని కూడా పట్టించుకుంటున్నదా? అనేది మాత్రం అర్థం కావడం లేదు.
ఎందుకంటే బిజెపి తెచ్చిన చట్టం కేవలం హిందూ మత పరిరక్షణ కోసమే అనడంలో సందేహం లేదు. కానీ.. సిద్దూ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ‘హిందూ మతం మీద ద్వేషంతో’ అని కూడా అనిపించకూడదు.
ఇంతకూ బిజెపి తెచ్చిన చట్టంలో ఏం ఉంటుంది..? ఎలాంటి మతమార్పిడులను వారు నేరంగా గుర్తించారు? ఎలాంటి వాటికి శిక్షలు రూపొందించారు అనేది గమనించాలి.
బలవంతంగా, వంచించి, ఒత్తిడి చేసి, ప్రలోభపెట్టి, వివాహం చేసుకుంటానని నమ్మించి మతమార్పిడులకు పాల్పడితే మాత్రమే వాటిని ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. మతం మారిన వ్యక్తికి సంబంధించి రక్తసంబంధం ఉన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే పైన పేర్కొన్న అయిదు కారణాలు తాను మతం మారడం వెనుక లేవు అని సదరు వ్యక్తి చెప్పుకునే అవకాశం ఎటూ ఉంటుంది.
ఇంకో కోణంలో చూసినప్పుడు.. ఈ చట్టం మతమార్పుడులను పూర్తిగా నిరోధించడం లేదు. మతం మారదలచుకున్న వ్యక్తి ఇప్పుడు కూడా మారవచ్చు. కాకపోతే తాను మతం మారడానికి రెండు నెలల ముందు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటుకు తెలియజేయాల్సి ఉంటుంది. పోలీసు విచారణ కూడా ఉంటుంది. దాని తర్వాత.. మత మార్పిడి జరగవచ్చు. అది చట్టబద్ధంగా జరిగినట్టు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు ద్వారా.. సంబంధిత రెవెన్యూ అధికారులందరికీ తెలియజేస్తారు. ఇది పెద్ద ఇబ్బందికరమైన నిబంధనేం కాదు. ఎందుకంటే.. పేరు మార్చుకోవాలంటేనే.. ఇలాంటి సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంటుంది. అలాంటప్పుడు మతం మారడానికి ఒక పద్ధతి ఉండడం తప్పుకాదు.
అయితే మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయడం వలన.. విచ్చలవిడి మతమార్పిడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉంది. కేవలం బిజెపి మీద ద్వేషంతో చేసినట్టుగా ఉన్నదే తప్ప.. ఔచిత్యం ఉన్న నిర్ణయం అనిపించుకోదు.