జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని, తెలంగాణా మోడల్ దేశమంతా అమలు చేస్తానని చెవులు చిల్లులు పడేలా ఊదరగొట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
దేశంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ఏ ప్రాంతీయ పార్టీ కూడా కేసీఆర్ కు అండగా లేదు. కేసీఆర్ బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ తో కలవకుండా బీజేపీని, మోడీని ఓడించడం సాధ్యం కాదంటున్నాయి. దేశంలో బీజేపీయేతర పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకు రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయన వివిధ పార్టీల అధినేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కన్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానని ఒకప్పుడు కేసీఆర్ ప్రకటించగానే ఆయన ప్రధాని అయిపోయినట్లుగా బీఆర్ ఎస్ మంత్రులు, నాయకులు భావించారు.
ఒకప్పుడు కేసీఆర్ వివిధ రాష్ట్రాలు తిరిగి బీజేపీయేతర సీఎంలను, పార్టీల అధినేతలను కలుసుకొని మంతనాలు జరిపారు. కానీ ఆయన ఆశించిన ప్రతిస్పందన రాలేదు. జాతీయ రాజకీయాలు అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ కొంతకాలం కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
చివరకు ఆయన జాతీయ రాజకీయాలు మహారాష్ట్రకే పరిమితం అయ్యాయి. కానీ ఆ రాష్ట్రంలోనూ పేరున్న నాయకులు, రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకులు ఎవరూ కేసీఆర్ జాతీయ పార్టీలో చేరలేదు. కొద్దిమంది గల్లీ నాయకులు వచ్చి చేరారు. కేసీఆర్ చేసిన పని ఏమిటంటే న నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఏపీలో బీఆర్ఎస్ శాఖను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ అక్కడా ఆయన ఆశించిన ఫలితం రాలేదు. అక్కడా పార్టీలో చేరికలు లేవు. పార్టీ ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ దాదాపు చేతులెత్తేశారు.
ఆయన హైదరాబాదులోనే ఉంటున్నట్లు సమాచారం. ఏపీలోనూ పార్టీ ఆఫీసు ప్రారంభించారు. కేసీఆర్ సాధించిన విజయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మించుకోవడం. ఇంతకు మించి ఆయన జాతీయ రాజకీయాలు ముందుకు పోలేదు. మరి పార్లమెంటు ఎన్నికలనాటికి జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చెప్పలేం.