‘లక్ష’ కోసం ప్రమాణాలు.. బాబులో అంత భయమా?

చంద్రబాబునాయుడు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు. కుప్పం ప్రజలు ఎంత అమాయకులు అయినప్పటికీ.. చంద్రగిరి పరాజయం తర్వాత పలాయనం చిత్తగించిన తాను కుప్పం ప్రజల అమాయకత్వాన్ని నమ్ముకుని ఆ నియోజకవర్గంనుంచి అప్రతిహతంగా ప్రతిసారీ గెలుస్తున్నప్పటికీ..…

చంద్రబాబునాయుడు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు. కుప్పం ప్రజలు ఎంత అమాయకులు అయినప్పటికీ.. చంద్రగిరి పరాజయం తర్వాత పలాయనం చిత్తగించిన తాను కుప్పం ప్రజల అమాయకత్వాన్ని నమ్ముకుని ఆ నియోజకవర్గంనుంచి అప్రతిహతంగా ప్రతిసారీ గెలుస్తున్నప్పటికీ.. ఎన్నడూ సాధించలేకపోయిన ఒక అరుదైన ఫీట్ ను ఆయన ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆయన లక్ష ఓట్ల మెజారిటీ కోరుకుంటున్నారు. అదే లక్ష్యంగా ఇప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ ప్రహసనం వెనుక అతిపెద్ద భయం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చేందుకు కష్టపడి పనిచేస్తాం అన్నట్టుగా కార్యకర్తలతో ప్రమాణాలకు స్కెచ్ వేసిన చంద్రబాబు.. ఆ ప్రమాణాల ద్వారా.. కనీసం వారు తన పార్టీని వీడి వైసీపీలో చేరకుండా ఉండేందుకు తపన పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో ఇటీవలికాలంలో తెలుగుదేశం పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ప్రజల ఆదరణ తగ్గిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలను వారు చాలా వరకు కోల్పోయారు. చంద్రబాబు స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా కుప్పం మునిసిపాలిటీని కూడా కోల్పోయారు.

ఇలాంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో చంద్రబాబు సాధించిన 30 వేల ఓట్ల మెజారిటీ అనేది బాబు చరిత్రలో అత్యల్పం. అంటే అప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు కాస్త పక్కచూపులు చూస్తున్నట్టుగా ఆయన గ్రహించారు. ఇప్పుడు పరిస్థితి మరీ దిగజారి ఉంది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఇక్కడ చాలా బలపడుతోంది. 

కేవలం చంద్రబాబును ఓడించడం లక్ష్యంగా ఈ నియోజకవర్గ నాయకత్వంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తన సొంత నియోజకవర్గం ఇదే అన్నంత స్థాయిలో కుప్పం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇక్కడి వ్యూహాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి మిగిలిన కార్యకర్తలు కూడా రోజులు గడిచేకొద్దీ జారిపోతారనే భయం చంద్రబాబులో ఉంది. వైసీపీ ఈ నియోజకవర్గంలో తమ పార్టీ తలుపులు తెరచిందంటే గనుక.. బాబు ఓటమి కోసం ఏదైనా తాయిలాల ఆశచూపించిందంటే గనుక.. తన పార్టీ కార్యకర్తలు ఖాళీ అయిపోతారనేది ఆయన భయం. అందుకే వారితో ప్రమాణాలు చేయించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారనేది పలువురి విశ్లేషణ. 

ఇదే నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుస్తూ, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. ఇన్నాళ్ల తర్వాత.. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు న్యాయంచేస్తా, మళ్లీ గెలిపించండి అని అనడమే.. ఆయన ఇన్నాళ్లు చేసిన ద్రోహాలకు నిదర్శనం అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.