నేను గ్రేటాంధ్రాలో చాలా కాలంగా కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాస్తున్నాను. రెగ్యులర్ గా కాకపోయినా ఏదైనా ఒక టాపిక్ మీద నా పాయింట్ చెప్పాలనిపించినప్పుడు రాస్తుంటాను. ఎందుకో మొదటిసారి నాకు తెలుగులో రాయాలనిపించింది. దానికి కారణం తెలుగు వాళ్లకి, భాషకి సంబంధించిన టాపిక్ ఇందులో ఉంది కనుక.
ఇదివరకు తెలుగు ఊళ్లల్లో అడల్ట్ సినిమాలకి ప్రత్యేకించి కొన్ని సినిమా హాల్స్ ఉండేవి. ఆ హాల్స్ వైపుకి ఆడవాళ్లు వెళ్లేవాళ్లు కాదు. అటువైపుకి వెళ్లి సినిమాలు చూసే మగవాళ్లు కూడా తెలిసినవాళ్ల కంటపడకుండా వెళ్లేవాళ్ళని చెప్పుకునేవాళ్లు. ఎందుకంటే తమకు కొన్ని చూడాలని ఉన్నా సభ్యసమాజం ముందు చీదరింపుకి గురికాకూడదన్న సిగ్గు, బిడియం అప్పటి మగాళ్లల్లో కూడా ఉండేది. ఆ తర్వాత వీడియో పార్లర్స్ అని వచ్చాయి. అందులో నీలిచిత్రాలు వేసేవాళ్లట. అది కూడా ఫలానా చోట పోలీసులు రైడ్ చేసి ఆ బూతుచిత్రాలు చూస్తున్నవారిని పట్టుకున్నారన్న వార్త వల్ల ఫలానా ప్రాంతంలో వీడియో పార్లర్లు ఉన్నాయని తెలిసేది. జనంలో సిగ్గు ఉండేది, చట్టం బలంగా ఉండేది…అందుకే ఇలాంటివి గుట్టుగా జరిగేవి.
కానీ క్రమంగా కాలం మరుతూ వచ్చింది. ఇప్పుడు అన్నీ అరిచేతిలోనే దొరికేస్తున్నాయి. చిన్న, పెద్ద, ఆడ, మగ అందరికీ అన్ని రకాల కంటెంట్స్ కామన్ ప్లాట్‌ఫాం మీద కనిపించేస్తున్నాయి.
ఇక సిగ్గు జనంలో ఉన్నా, తీసేవాళ్లల్లో, చేసేవాళ్లల్లో ఇసుమంతైనా ఉండట్లేదు. అప్పట్లో నగ్నచిత్రాల్లో నటించడానికి మెయిన్ స్ట్రీం హీరోయిన్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు. హిందీవాళ్ల సంగతి ఎలా ఉన్నా తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్స్ మాత్రం మరీ బరితెగించే వారు కాదు.
ప్రస్తుతం “జిద్ కర్దా” అని తమన్నా నటించిన వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. స్టిల్స్ అవీ చూస్తే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగ అనిపిస్తుంది. కానీ లోపలికెళ్తే అంతా విశృంఖలత్వమే. చేసుకోబోయేవాడి మీద కోపం వచ్చి అతని స్నేహితుడితో సెక్సులో పాల్గొని తర్వాత మళ్లీ కోపం తగ్గాక చేసుకోవాల్సిన వాడిని పెళ్లిచేసుకుంటుంది తమన్నా పాత్ర. ఏవిటిది? కథాంశంగా కానీ, దృశ్యంగా కానీ రెండూ బూతే కదా! తమన్నా స్థాయి నటి చేయాల్సిన పాత్రా ఇది? ఆ సెక్స్ సీన్ కూడా పై దుస్తులు తీసేసి పచ్చిగా సంభోగదృశ్యంలో నటించడమంటే ఏమనాలి? ఈ స్థాయి నటీమణులు అలా నటిస్తే అది యాక్సెప్టెబుల్ అయిపోదా?! ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్ని వస్తాయో కదా!
ఏం? హాలీవుడ్లో లేవా, హిందీలో లేవా? అయినా ఇది హిందీ సిరీసే కదా! అని అనవచ్చు. కానీ మెయిన్ స్ట్రీం తెలుగు హీరోయిన్ అన్నాక కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఒక ఆడది ఎంతమందితోనైనా పడుకోవచ్చు అని చూపించడం మహిళాసాధికారత అనుకోవాలనా? మహిళలే ఈ విషయం మీద స్పందించాలి. మహిళల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న దర్శకులు అని వాళ్ల మీద పడనక్కర్లేదు. అలా ఎక్స్‌ప్లాయిట్ అయ్యే స్థితిలో తమన్నా ఏమీ లేదుగా! ఆమె కెరీర్ నిక్షేపంగా ఉంది.
ఇక మరో వెబ్ సిరీస్ “రానానాయుడు”- ఒక పచ్చిబూతుల ధారావాహికం. ట్రైలరొక్కటి చూసి సిరీస్ వైపుకి అస్సలు వెళ్లలేదు. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో అలాంటి సిరీస్ లో నటించడం బరితెగింపుతో పాటూ సమాజాన్ని భ్రష్టు పట్టించడమే. ఆయనకేం పట్టింది ఇలాంటి పచ్చి సిరీసులో నటించడానికి? ఇంతా చేసి పొందిందేమిటి? పంచాంగంలో చెప్పినట్టు ఆదాయం రెండింతలు, అవమానం నాలుగింతలు. ఆదాయం పెరిగితే అవమానం ఎంతైనా భరించేస్తారన్నమాట. ఇది కూడా సిగ్గు, మానం లేని తనమే.
ఈ కోవలోనే మరొక చెత్త సిరీస్ “సైతాన్”. తీసిందే బూతు పైగా దీని దర్శకుడు తనను సమర్ధించుకుంటూ ఇస్తున్న ఇంటర్వ్యూలు చూస్తుంటే ఒంటిమీద పురుగులు పాకుతున్న ఫీలింగొస్తుంది. అమాయకుల్ని విపరీతంగా హింసిస్తే వాళ్లు సైతాన్లుగా మారతారన్నది కథాంశమనుకుంటే దానిని వల్గారిటీ లేకుండా తీయలేరా? నాకు తెలిసి ఎంత నేచురల్ అనుకున్నా అలాంటి భాష అంత అలవోకగా ఎవరూ మాట్లాడరు. ఇక హింస కూడా అంత దారుణంగా అవసరం లేదు. జనం చూస్తున్నారు కదా అని ఎంత పడితే అంత తీసేస్తే సమాజంలోని సున్నితత్వాన్ని చంపేసి హింస, సెక్స్ అనేవి వినోదంలో భాగమనుకునేలా జనం మారిపోతే క్రైం మరింత పెరుగుతుంది.
తెలివైనవాడిగా ముద్రవేయించుకుని ఆధునిక ఓషోలా మాట్లాడే ఆర్జీవీ కూడా “అవి నచ్చినవాళ్లు చూస్తున్నారు. మీకు నచ్చకపోతే దూరంగా ఉండండి” అని చెప్తూ మోరాలిటీ అస్సలు అవసరం లేదంటున్నాడు.
తనకి కుటుంబం లేదు కదా అని కుటుంబాలు ఉన్న అందర్నీ తనలా ఆలోచించమంటే ఎలా? తనకు సిగ్గులేదని అందర్నీ సిగ్గు విడిచేయమంటే సబబేనా?
సైకాలజిస్టులు కూడా ఈ విషయం మీద తమ నోరు విప్పాలి. ఇలాంటి సిరీస్ ల మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
ఈ గంజాయిమొక్కల మధ్యన తులసివనంలాంటి “ఆదిపురుష్” విడుదలవుతోంది. అదైనా కొత్తతరానికి విలువలు నేర్పాలని, పద్ధతులు చెప్పాలని, స్త్రీని చూసే దృక్పథం మార్చాలని, భాష వాడకంపై సభ్యత పెంచాలని ఆశిస్తున్నాను. కొత్తతరానికి కొత్త రకంగా రామాయణాన్ని అందిస్తున్నందుకు తీసినవాళ్లకి, చేసినవాళ్లకి ధన్యవాదాలు. “ఆదిపురుష్” మైకంలో పైన చెప్పుకున్న చెత్త సిరీస్ లను జనం మరిచిపోవాలని కోరుకుంటున్నాను.
ఉషా చౌదరి