ఓం నమో వేంకటేశ స్క్రిప్టు గుర్తుందా? హీరో వెంకటేష్ అందులో రకరకాల వేషాలు, మిమిక్రీ కళలు ప్రదర్శిస్తూ సభాప్రసంగాలు గట్రా చేస్తుంటాడు. ఓ రాజకీయనాయకుడి అభినందన సమావేశానికి ఒక రేటు మాట్లాడుకుని, ఒక స్క్రిప్టు సిద్ధం చేసుకుని వెళతాడు. అదే అతడి ప్రత్యర్థి మీటింగులో మాట్లాడ్డానికి కూడా మరొక డీల్ మాట్లాడుకుని ఉంటాడు. అయితే స్క్రిప్టు మారిపోతుంది. నాయకుడిని పొగడవలసిన సభలో, అతడి అవలక్షణాలన్నీ ఏకరవు పెట్టి.. ఆ నాయకుడు తనను కొట్టడానికి తరిమివచ్చే పరిస్థితి తయారుచేసుకుంటాడు.
ఇక్కడ పరిస్థితి అలా ఇంకా తయారు కాలేదు గానీ.. పవన్ కల్యాణ్ మాటలను గమనిస్తే ఆయన స్క్రిప్టు మారిపోయిందేమో అనిపిస్తోంది. ఒకచోట చదవవలసిన స్క్రిప్టును పొరబాటుగా మరొకచోట ఆయన చదువుతున్నారేమో అనిపిస్తోంది. సైమల్టేనియస్ గా ఏకకాలంలో అనేక చిత్రాల షూటింగులు చేస్తున్న పవన్ కల్యాణ్.. ఒక సెట్లో చెప్పవలసిన స్క్రిప్టును ఇంకో సెట్లో చెబితే ఎలా ఉంటుంది. ఇక్కడ రాజకీయంలో కూడా అలాగే ఉంది.
ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ నన్ను ముఖ్యమంత్రిని చేయండి మొర్రో అని మొరపెట్టుకుంటున్నాడు. మరొకవైపు తమ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసేంత సీన్ ఇంకా లేదని.. తనకు తోచిన రీతిలో వ్యక్తం చేస్తూ ఉంటాడు. పొత్తులతో తప్ప ముందుకు వెళ్లలేమని అంటూనే, పొత్తులు పెట్టుకోవాలా వద్దా ఇంకా డిసైడ్ చేయలేదని అంటాడు. ఇన్ని కన్ఫ్యూజన్ ల మద్య ఉండే పవన్ కల్యాణ్.. ప్రజల ఎదుటకు వచ్చిన ప్రతిసారీ ‘నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయండి ప్లీజ్’ అని చెప్పడం కామెడీగా ఉంది. ఎందుకంటే.. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో పవన్ కల్యాణ్ జనసేన పోటీచేయబోతున్నది మహా అయితే పాతిక నుంచి ముప్ఫయి స్థానాలు. అన్ని సీట్లూ గెలిచినా కూడా ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ప్రజలు ఆయనను ఎలా ముఖ్యమంత్రిని చేయగలరు? అనేది అందరికీ కలుగుతున్న సందేహం.
పవన్ కల్యాణ్.. పొత్తుల చర్చల సమయంలో చంద్రబాబునాయుడు వద్ద చదవవలసిన స్క్రిప్టును ప్రజల వద్ద చదువుతున్నట్టుగా ఉంది. చంద్రబాబు దయతో కొన్ని సీట్లు పుచ్చుకుని, గెలవాలనుకుంటున్న పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి కావాలనుకున్నా కూడా కేవలం చంద్రబాబు దయతో మాత్రమే సాధ్యం. తాను సీఎం కావాలని ఉంటే పవన్ , చంద్రబాబును వేడుకోవాలి. అంతే తప్ప.. చంద్రబాబు ఒకవేళ పొత్తుల్లో 30 సీట్లు ఇచ్చినా కూడా.. గట్టి అభ్యర్థులు ఉన్నారని ధీమాగా చెప్పలేని స్థితిలో పవన్ నిర్దిష్టమైన విధానంగానీ, ప్రజల కోసం ఏం చేయాలని ఉన్నదో బయటకు చెప్పగల ఆలోచన గానీ లేకుండానే.. కేవలం సీఎం కుర్చీ గురించి..దేబిరించడం చాలా చవకబారుగా ఉంది. చంద్రబాబు ప్రాపంకంలో బతుకుతూ రాజకీయం చేయాలనుకున్నంత వరకు ఆయన సీఎం ఎలా అవుతారని ప్రజలు అనుకుంటున్నారు.